Share News

తలసేమియా బాధితుల కోసం...

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:27 AM

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సినీ నటుడు మంచు మనోజ్‌ పిలుపునిచ్చారు.

తలసేమియా బాధితుల కోసం...
రక్తదానం చేస్తున్న హీరో మంచు మనోజ్‌... సమావేశంలో మాట్లాడుతున్న మంచు మనోజ్‌

రక్తదానం చేసిన హీరో మంచు మనోజ్‌

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సినీ నటుడు మంచు మనోజ్‌ పిలుపునిచ్చారు. నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్‌ కర్నూలు ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌లో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సిని నటుడు మంచు మనోజ్‌, ఆయన భార్య భూమా మౌనిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా బాధితుల కోసం మంచు మనోజ్‌ రక్తదానం చేశారు. అనంతరం రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచు మనోజ్‌ మాట్లాడారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తలసేమియా వ్యాధిని తెలుసుకునేందుకు గర్బిణులు, జన్యుపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ అభిమానులు, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్‌ మరిన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించేలా పోస్టర్లను ఆవిష్కరించారు. రక్తదాన శిబిరంలో 85 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ కె.అరుణ, కోశాధికారి నరసింహ, కమిటీ సభ్యులు జి.శ్రీనివాసులు యాదవ్‌, కేవీ సుబ్బారెడ్డి, భీమా శంకర్‌ రెడ్డి, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.మోతిలాల్‌, కన్వీనర్‌ రమేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:27 AM