హామీల అమలులో బీజేపీ విఫలం
ABN , Publish Date - May 30 , 2025 | 12:11 AM
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు గడుస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల హామీలను అమలు చేయలేదని సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధు
పాములపాడు, మే 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు గడుస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల హామీలను అమలు చేయలేదని సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. గురువారం పాములపాడులో పార్టీ సీనియర్ నాయకుడు రామేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీపీఎం కార్యాలయ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్‌లో ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టకుండా ట్రంప్ ఆదేశాల మేరకు కాల్పుల విరమణ చేపట్టారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, నల్లదనాన్ని విదేశాల నుంచి తెచ్చి పేదలకు పంచుతామని చెప్పి అధికారం లోకి వచ్చాక హామీలు నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించివేస్తున్నదని అన్నారు. పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి రమేశ్‌కుమార్, సీనియర్ నాయకులు, ప్రభాకర రెడ్డి, రాజశేఖర్ మాట్లాడుతూ ఒకప్పుడు మోదీని విమర్శించిన చంద్రబాబు నేడు భజన చేస్తున్నారని అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, ఏసురత్నం, నాగేంద్రుడు పాల్గొన్నారు.