బ్రహ్మచారిణిగా భ్రామరి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:11 PM
శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతు న్నాయి.
మయూర వాహనంపై విహరించిన స్వామి, అమ్మవార్లు
శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు
శ్రీశైలం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతు న్నాయి. రెండో రోజు మంగళవారం భ్రమరాంబికా అమ్మవారు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి విహరించారు. నవదుర్గా అలంకారాల్లో ఒకటైన బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించిన అమ్మవారిని దర్శించుకోవడంతో శుభఫలితాలు, విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. గ్రామోత్సవంలో భాగంగా మయూర వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అశేష భక్తజనం నడుమ కోలాహాలంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవ స్థానం ఈవో శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. గ్రామోత్సవం సాగుతుండగా కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాదస్వరం, కేరళచండీ, ఢమరుకం, చెక్కభజన, తప్పెడ, డోలు విన్యాసం తదితర కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు: ఆలయంలోని దక్షిణ మాడవీధిలో ఉన్న నిత్య కళారాధన వేదిక వద్ద సాయంత్రం నంద్యాలకు చెందిన ఎస్.నాట్యాంజలి కూచిపూడి కళా క్షేత్రం కళాకారుల సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శైవ గీతాలకు చిన్నారులు, కళాకారుల ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
కుమారి పూజ ప్రత్యేకం : దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కుమారి పూజలు జరిపించబడుతున్నాయి. ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్ర్తాలను సమర్పించి పూజించడం ఆనవాయితీ.
నేడు చంద్రఘంట అలంకరణ: దసరా మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం భ్రమరాంబికా అమ్మవారు చంద్రఘంట అలంకారణలో దర్శనమిస్తారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు రావణవాహనసేవ నిర్వహిస్తారు.