మహాగౌరిగా భ్రమరాంబికాదేవి
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:38 PM
శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.
నంది వాహనంపై కొలువుదీరిన ఉత్సవమూర్తులు
శ్రీశైలం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నవదుర్గ అలంకారాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఎనిమిదో రోజు మహాగౌరి స్వరూపంలో అలంకరించారు. నవదుర్గ మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తిగా చెప్పబడుతోంది. ఈదేవి తెల్లని వస్ర్తాలను ధరించి, చతుర్భుజాలను కలిగి ఉంటుంది. కుడివైపు పైభుజంలో త్రిశూలాన్ని క్రింది భు జంలో అభయ హస్తాన్ని, ఎడమవైపు పైభుజంలో వరముద్రను, కింది భుజంలో ఢమ రుకాన్ని కలిగి ఉంటుంది. మహాగౌరి తన పార్వతిరూపంలో పరమశివుని భర్తగా పొందేం దుకు కఠోర తపస్సు చేయసాగింది. ఈతపస్సు కారణంగా ఈమె శరీరమంతా నల్లబడింది. ఆ తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఈమె శరీరంపై గంగాజలాన్ని చిలకరించాడు. అప్పడు ఆదేవి తేజోవంతమైన గౌరవర్ణంతో అలరారింది. అందుకే ఈదేవి మహాగౌరిగా పిలువబడింది. ఈ దేవిని పూజించడంతో సకల పాపాలను నశిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
గ్రామోత్సవం రద్దు
ఆది దంపతులను ప్రత్యేక అలంకరణలో నంది వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. ఆలయ ఉత్సవం నిర్వహించారు. అయితే వర్షం కారణంగా గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. ఆలయ ఈవో ఎం.శ్రీనివాస రావు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. కళారూపాలు, వేషధారణలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
నేడు సిద్ధిదాయిని అలంకరణ
తొమ్మిదో రోజు మంగళవారం అమ్మ వారు సిద్ధిదాయిని అలంకరణలో దర్శన మిస్తారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు కైలాస వాహనంపై విహరించనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
దసరా మహోత్సవాల సందర్బంగా ఆలయ దక్షిణమాడ వీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు నటరాజ కళా కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, గుంటూరు వారిచే సంప్రదాయ నృత్యం, రాత్రి 8గంటల నుంచి వి. లక్ష్మి సునీత వారి బృందంతో భక్తి సంగీత విభావరి భక్తులను అకట్టుకుంది.
భక్తుల రద్దీ
శ్రీశైల క్షేత్రంలో భక్తులతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, దర్శనాల ద్వారా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. భక్తులు పాతా ళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ముందస్తుగా తీసుకున్న భక్తులకు రెండు విడతలుగా స్పర్శ దర్శనానికి అధికారులు అనుమ తిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు.