కాత్యాయనిగా భ్రమరాంబికాదేవి
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:59 PM
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.
శ్రీశైలంలో ఆరో రోజు వైభవంగా కొనసాగిన శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీశైలం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు శనివారం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చన, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారాలు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాల జపానుష్టానాలు, చండీ హోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానాలు, చండీ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు నిర్వహించారు. అలాగే రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్ర పారాయణలు నిర్వహించారు. రాత్రి 9 గంటల నుంచి కాళరాత్రి పూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు చేశారు. భ్రమరాంబికాదేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవదుర్గలలో ఆరో రూపమైన ఈ దేవి చుతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయ హస్తాన్ని, వరముద్రను, ఎడమ వైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటారు. వర్షం కారణంగా స్వామి, అమ్మవార్ల హంస వాహన సేవ, పుష్ప పల్లకీ సేవలను రద్దు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళా రాధన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శ నలు ఏర్పాటు చేశారు. నెల్లూరుకు చెం దిన కె. సుధాకరరావు, వారి బృందం చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరింపజేశాయి.
నేటి కార్యక్రమాలు
భ్రమరాంబ అమ్మవారు ఏడో రోజు ఆది వారం కాళరాత్రి అలంకారంలో దర్శనమి స్తారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు గజ వాహన సేవ నిర్వహించనున్నారు.