Share News

ముఠాగా మారి..!

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:48 AM

ముఠాగా మారి..!

ముఠాగా మారి..!

దొంగతనాలు, దొపిడీలే టార్గెట్‌

చిత్తూరులో ఇటీవల చోరీకి యత్నం

అడ్డంగా దొరికిపోయిన నంద్యాల వాసులు

వారిపై గతంలో పలు కేసులు నమోదు

చర్చనీయాంశమైన ‘చిత్తూరు’ ఘటన

చిత్తూరు జిల్లా కేంద్రంలో గత వారం ఓ దొంగల ముఠా హల్‌ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ ముఠాలో కీలక నేరస్థుడితో పాటు మరో ముగ్గురు నిందితులు నంద్యాల జిల్లాకు, మరో ముగ్గురు నిందితులు అనంతపురం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. దీంతో ఈ ముఠా వ్యవహారం ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో హాట్‌ టాఫిక్‌గా మారింది. సదరు ముఠాలోని కీలక నేరస్థుడు పసుపులేటి సుబ్రహ్మణ్యం అలియాస్‌ మాల్యాలుపై నంద్యాలలో గతంలో ఆరు కేసులు నమోదై ఉండటం నంద్యాల జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నంద్యాల జిల్లా కేంద్రంలోని సాయిబాబానగర్‌కు చెందిన పసుపులేటి సుబ్రమణ్యం ఆటో డ్రైవర్‌గా ఉంటూ ఆ తర్వాత ఇదే కాలనీలో.. కట్టెల డిపో పెట్టాడు. అయితే ఇదే క్రమంలో జిల్లాలోని బేతంచెర్ల మండలం ముద్దవం గ్రామానికి చెందిన రామకృష్ణ కూడా నంద్యాలకు వలస వచ్చి ఇదే కాలనీలో కట్టెల డిపో పెట్టాడు. కొన్ని నెలల తర్వాత సుబ్రహ్మణ్యం, రామకృష్ణల మధ్య వాగ్వాదం కాస్తా గొడవలకు దారి తీసింది. ఆ తర్వాత రామకృష్ణను 2005లో సుబ్రహ్మణ్యం పట్టపగలే హత్య చేయడం అప్పట్లో సంచలనమైంది. ఎమ్మిగనూరుకు చెందిన ఓ ముఠాతో కలిసి సుబ్రహ్మణ్యం ఈ హత్య చేసినట్లు నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

నంద్యాల, మార్చి 18(ఆంధ్రజ్యోతి):

ఫర్నీచర్‌ షాపు పేరుతో రూ.కోట్లలో అప్పులు

పసుపులేటి సుబ్రహ్మణ్యం నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా.. ఎస్‌ఎల్‌వీ పేరుతో అప్పట్లో ఫర్నీచర్‌ దుకాణం పెట్టాడు. కంతుల వారీగా వారిగా ఫర్నీచర్‌ వ్యాపారానికి తెరలేపాడు. ఈ క్రమంలో పెద్దఎత్తున ఖాతాదారులు నగదు చెల్లించారు. సదరు నగదుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి సొమ్ముచేసుకున్నారని సమాచారం. ఒక్కసారిగా ఐపీ పెట్టి 2019లో చిత్తూరుకు మకాం మర్చాడు. అక్కడ కూడా ఇదే తరహాలో ఇదే పేరుతో ఫర్నీచర్‌ దుకాణం పెట్టి పలు వ్యాపారాలు చేసి రూ.కోట్లలో అప్పులు పాలైనట్లు తెలిసింది. అక్కడ పరిచమైన ఆరుగురితో కలిసి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇదే క్రమంలో ఈనెల 12వ తేదీన చిత్తూరు పట్టణంలో ఓ దుకాణంలో దొంగతనానికి యత్నించి ముఠా సభ్యులతో కలసి సుబ్రహ్మణ్యం పోలీసులకు దొరికిపోయాడు. అక్కడి స్థానికులు వీరిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

నిందితులు అందరూ తెలిసిన వారే

సదరు ముఠాలోని నిందితులందరూ కూడా కీలక నేరస్థుడు సుబ్రహ్మణ్యంకు తెలిసిన వారే. 2005లో హత్య చేయడంతో భాగస్వాములైన వారిలో ఒకరైన దొమ్మర కిష్ణప్ప సదరు హత్య తరువాత నంద్యాల నుంచి అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జారుట్ల రామాపురం గ్రామానికి వలస వెళ్లి ఇప్పటికి వరకు అక్కడే జీవిస్తున్నట్లు తెలిసింది. నంద్యాలలోని తన ఫర్నీచర్‌ దుకాణంలో పనిచేసిన నంద్యాల పట్టణానికి చెందిన చల్లగాలి నవీన్‌కుమార్‌(ఏ3), ఇబ్రహీం (ఏ2), సుబ్రహ్మణ్యం (ఏ1), కుంచం సంపత్‌ కుమార్‌ (ఏ7)లు మరో ముగ్గురు రామాంజనేయులు(ఏ4), దొమ్మర రాజశేఖర్‌(ఏ5) దొమ్మర నెట్టి కంటయ్య(ఏ6)లతో కలసి చిత్తూరులో దోపిడీకి వెళ్లి దొరికిపోయారు.

అతడిపై ఆరు కేసులు

చిత్తూరు దొంగల ముఠా ఘటనలో కీలక నేరస్థుడిగా నమోదైన పసుపులేటి సుబ్రహ్మణ్యం(ఏ1)పై నంద్యాల జిల్లా కేంద్రంలో గతంలో ఆరు కేసులు నమోదయ్యాయి. రెండు హత్య కేసులు. ఒకటి దొంగతనం.. రాబరీ కేసులు. మరో రెండు బైండోవర్‌ కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల పరంగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఓ కీలక నాయకుడి అనుచరుడి హత్య, నంద్యాల తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కానాల సమీపంలో కల్వర్టు వద్ద ఓ మహిళ హత్య ఘటనలో సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీటితో పాటు 2005లో టెలికాం డీఈఈ వెంకటేశ్వర్లు ఇంట్లో దొంగతనం కేసుతో పాటు.. ఇదే క్రమంలో టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో రాబరీ కేసు నమోదైంది. సదరు కీలక నేరస్థుడిపై రౌడీషీట్‌ నమోదు ఉండటంతో.. టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా చిత్తూరు దోపిడీ కేసులోని ఏ7 నిందితుడు కుంచం సంపత్‌కుమార్‌పై నంద్యాల ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో 2011లో రోడ్డు ప్రమాదం కేసు ఒకటి నమోదైంది.

Updated Date - Mar 19 , 2025 | 12:48 AM