రమణీయం.. గోరంట్ల మాధవుడి రథోత్సవం
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:16 AM
సాయం సంధ్యా వేళ.. హంద్రీతీరాన మాధవుడి రథోత్సవం భక్తులను పరవశింపజేసింది. రథోత్సవ ఆద్యంతం భక్తులు తన్మయత్వంతో గోవిందనామస్మరణ చేశారు. దీంతో హంద్రీతీరం మార్మోగింది.

కోడుమూరు రూరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): సాయం సంధ్యా వేళ.. హంద్రీతీరాన మాధవుడి రథోత్సవం భక్తులను పరవశింపజేసింది. రథోత్సవ ఆద్యంతం భక్తులు తన్మయత్వంతో గోవిందనామస్మరణ చేశారు. దీంతో హంద్రీతీరం మార్మోగింది. గోరంట్ల లక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం అశేష భక్తజనం మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. ఆలయంలో విశేష పూజలు, అభిషేకములు నిర్వహించారు. రథాన్ని సుగంధపూల తోరణాలతో ముస్తాబు చేశారు. అనంతరం సాయంత్రం ఆలయ అధికారులు, పూజారులు చేరుకుని రథశాల వద్ద శాస్ర్తోక్తంగా పూజలు చేపట్టారు. సాత్విక బలిదానం గుమ్మడి, టెంకాయలు సమర్పించారు. వెంటనే భక్తులు రథాన్ని లాగుటకు పోటీ పడ్డారు. ఎదురుమండపం వరకు రథాన్ని లాగి తిరిగి రథమండపం చేర్చారు. ఆపై భక్తులు రథానికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. సీఐ తబ్రేజ్ అధ్వర్యంలో కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ ఎస్‌ఐలు శ్రీనివాసులు, తిమ్మయ్య, తిమ్మారెడ్డి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈవో గుర్రెడ్డి, సిబ్బంది మురళి, టీడీపీ నాయకులు తిరములనాయుడు, దుబ్బన్న, సద్దల బాలకృష్ణ, సద్దల శీను, మధు, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.