రమణీయం.. స్వర్ణ రథోత్సవం
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:01 AM
శ్రీశైలంలో ఆది దంపతుల స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చనలు చేసిన తరువాత భక్తులకు దర్శనాలు కల్పించారు.
స్వామి, అమ్మవార్లకు పల్లకీ సేవ
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
శ్రీశైలం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో ఆది దంపతుల స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చనలు చేసిన తరువాత భక్తులకు దర్శనాలు కల్పించారు. స్వామిఅమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర పూజలు చేశారు. గంగాధర మండపం రథశాల వద్ద స్వర్ణరథంపై ఆశీనులై ఉన్న స్వామిఅమ్మవార్లకు పూజలు నిర్వహించారు. గంగాధర మండపం నుంచి మొదలుకొని నంది మండపం వరకు తిరిగి నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు స్వర్ణ రథోత్సవం కొనసాగింది. ఈవో శ్రీనివాసరావుతో పాటు పాలకమండలి సభ్యులు ఏవీ రమణ, గంగమ్మ, వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, అధికారులు పూజల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు చేశారు. సాయంత్రం ఆలయంలో పుష్పాలంకరణ చేసిన పల్లకిపై ఆదిదంపతులను ఆశీనులచేసి వార పూజల అనంతరం ఆలయ ప్రదక్షిణగా పల్లకీసేవను వైభవంగా నిర్వహించారు.
శివనామస్మరణతో..
శ్రీశైల క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మండల దీక్షలు విరమించుకునే శివస్వాములు.. శబరిమల యాత్రలో భాగంగా మల్లన్న దర్శనానికి వస్తున్న అయ్యప్ప స్వాములే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులతో క్షేత్రమంతా ఆధ్యాత్మిక సందడితో నిండిపోయింది. స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా నిలిపి వేసి అందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నందున భక్తులు ఆలయ సిబ్బందితో సహకరించవలసిందిగా ఈవో కారారు. అతిశీఘ్ర దర్శనం టికెట్ భక్తులు ఉచిత లడ్డూ ప్రసాదాలను పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.