అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:59 PM
మొంథా తుఫాను ప్రభావంతో మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, భద్రతా చర్యలు చేపట్టేందుకు అధి కారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాను ప్రభావంతో మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, భద్రతా చర్యలు చేపట్టేందుకు అధి కారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం తుఫాన్ నేపథ్యంలో భద్రతా చర్యలపై కలెక్టరే ట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొంథా తుపాను కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరం దాటుతున్నదని, దాని ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నంద్యాల జిల్లాపైన కూడా ఉండే అవకాశముందన్నారు. అందువల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉల్లి, మొక్కజొన్న, టమాటా రైతులు పంటకోతను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 30 శాతం మొక్కజొన్న కోత జరగగా, అధిక తేమ కారణంగా పంటలకు తక్కువ ధరలు పడే అవకాశముందని వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ కె. కార్తీక్, డీఆర్వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం కలెక్టర్‌తో పాటు జేసీ కె.కార్తీక్, డీఆర్వో రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు వారాల్లో రీ ఓపెన్ అయిన దరఖాస్తులు 481 ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా రెవెన్యూ, సర్వే విభాగాల్లో అధికంగా ఉన్నాయని, వెంటనే క్లియర్ చేయాలని తహసీల్దార్లు, ఆర్డీవోలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ స్వీకరణ 39 శాతం మాత్రమే ఉందని, 50 శాతానికి పెంచాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌పై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మొత్తం 282 అర్జీలు వచ్చాయని తెలిపారు.