న్యుమోనియాతో జాగ్రత్త
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:39 AM
చలికాలం వచ్చిందంటే చాలా మంది చిన్న పిల్లల్లో న్యుమోనియా వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయి. చలి తీవ్రత పెరిగే కొద్ది ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
చిన్నారులు సతమతం
జీజీహెచ్‌లో ఏటా 1,500 కేసులు
నేడు వరల్డ్ న్యుమోనియా నివారణ దినం
కర్నూలు హాస్పిటల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): చలికాలం వచ్చిందంటే చాలా మంది చిన్న పిల్లల్లో న్యుమోనియా వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయి. చలి తీవ్రత పెరిగే కొద్ది ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తరచూ జలుబు, దగ్గులతో అలసిపోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జలుబు దగ్గు, జ్వరంతో పాటు ఆయాసం ఎక్కువైతే అది న్యుమోనియా వ్యాధికి దారి తీయొచ్చు. న్యుమోనియాను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. ఈ వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 26 లక్షల మంది చనిపోగా, ఇందులో 7 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. న్యుమోనియాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో చైల్డ్ న్యూమోనియాకు వ్యతిరేకంగా గ్లోబల్ కోయలిషన్-2009 నవంబరు 12న మొదటిసారిగా వరల్డ్ న్యుమోనియా డేను నిర్వహించింది.
న్యుమోనియా బ్యాక్టీరియా లేదా వైరస్ కారణంగా ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధి. ఊపిరితిత్తుల్లోని గాలి గదుల్లోకి బ్యాక్టీరియా లేదా వైరస్‌తో నిండిన ద్రవ పదార్థం చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే సూక్ష్మ క్రిమి రకాన్నిబట్టి వ్యాధి ప్రభావం ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 7వేల మంది..
ఉమ్మడి జిల్లాలో ఏటా 7వేల మంది చిన్నారులు న్యుమోనియాతో బాధపడుతున్నారు. 2025 కర్నూలు జీజీహెచ్‌లో జనవరి నుంచి ఇప్పటి వరకు 910 మంది చిన్నారులు న్యూమోనియాతో అడ్మిట్ అయ్యారు. ఇక నంద్యాల జీజీహెచ్, ఆదోని ఏరియా ఆసుపత్రుల్లో కూడా పీఐసీయూ, ఎన్‌ఐసీయూ యూనిట్లలో చిన్నారులు న్యూమోనియాతో చికిత్స తీసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో 7వేల మంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
లక్షణాలు ఇవీ..
న్యుమోనియాకు గురైన వారిలో దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉంటాయి. జ్వరంతో పాటు ఆయాసం ఎక్కువ కావడం, శ్వాస కోశంలో నొప్పి, ఛాతీ భాగంలో నొప్పి, తలనొప్పి, ఆక్సిజన్ స్థాయిలో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో వికారం, వాంతులు, విరేచనలు కలుగుతాయి. తొలి దశలో ఉన్నప్పుడు గుర్తించి సరైన చికిత్స చేసుకోవాలి.
పీసీవీతో చెక్
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రొటీన్ ఇమ్యూనైజేషన్‌లో భాగంగా 6 వారాలు, 14 వారాలు, 9వ నెల వయస్సులో చిన్నారులకు మూడు డోసుల పీసీవీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది భవిష్యత్తులో చిన్నారులకు న్యుమోనియా రాకుండా అడ్డుకుంటోంది. దీంతో పాటు న్యూమోనియా వచ్చిన చిన్నారులను, ఆశా, ఏఎన్‌ఎంలు గుర్తించి వారికి దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే దగ్గు సిరప్ ఇస్తారు..
ఏడాదిలోపు చిన్నారుల్లో ఎక్కువ
కర్నూలు జీజీహెచ్‌లో ఏడాదిలోపు పిల్లలు ఎక్కువగా న్యుమోనియాలక్షణాలతో బాధపడుతూ పీఐసీయూ, ఎన్‌ఐసీయూలో చేరుతుంటారు. వీటిలో వంద శాతం, 5 శాతం మరణాలు ఉంటాయి. న్యూమోనియా లక్షణాలు కనబడగానే వెంటనే వైద్యులను సంప్రదించి ఆసుపత్రిలో చేరాలి. నెలలోపు చిన్నారులను ఎన్‌ఐసీయూ, నెలపైబడి చిన్నపిల్లలను పీఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. - డా.బి. విజయానందబాబు, ప్రొఫెసర్ అండ్ హెచ్‌వోడీ, చిన్న పిల్లల విభాగం, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
సకాలంలో చికిత్స అందించాలి
న్యుమోనియా సాధారణంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. దగ్గు, ఆయాసం, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారుల్లో చాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. బ్యాక్టీరియా కారణంగా సోకే న్యూమోనియాకు యాంటి బయాటిక్స్ ద్వారా చికిత్స అందించవచ్చు. - డా.కే. సింధూర రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రీషన్, కర్నూలు మెడికవర్ హాస్పిటల్
అండర్ ఫైవ్ కిల్లర్
భారతదేశంలో న్యుమోనియాను అండర్ ఫైవ్ కిల్లర్‌గా పిలుస్తున్నారు. జ్వరం, దగ్గు నిమిషానికి 50, 60 సార్లు ఎక్కువగా ఊపిరి తీసుకోవడం, చాతి ఎముకల ఎగురవేయడం వంటి లక్షణాలు ఉంటే వైద్యలను సంప్రదించాలి. ముఖ్యం గా న్యుమోనియా ఉన్నవారిలో జ్వరం ఉంటుంది. ఆ సమయంలో తడిగుడ్డలతో తుడవడం మంచిది కాదు. - డా.జి. సుధాకర్, సినియర్ పీడియాట్రీషన్ కిమ్స్ హాస్పిటల్, కర్నూలు