బ్యాంకర్లు సహకరించాలి
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:01 AM
జిల్లా దేశీయోత్పత్తి పెంపునకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు.

వీసీలో కలెక్టర్ రాజకుమారి
క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ
నంద్యాల నూనెపల్లె, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా దేశీయోత్పత్తి పెంపునకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా కమ్యులేటివ్ కమిటీ సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026కు రూ.50,711కోట్ల మేరకు పెంచేలా బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించా లన్నారు. పీఎం సూర్యఘర్, పీఎం విశ్వకర్మ పథకాలకు బ్యాంకర్లు తప్పనిసరిగా చేయూతనివ్వాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 485మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాలో వందశాతం పీఎం సూర్యఘర్ సోలార్ పలకలు ఏర్పాటు చేయడానికి నంద్యాల మండలంలోని పాండురంగాపురం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మహానంది మండలంలో సుగంధ అరటిపండ్లు ఇతర రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు నాబార్డుకు సహకారం అందించాలని సూచించారు. నల్లమల నన్నారి వేర్లతో చెంచులు షర్బత్ తయారుచేస్తున్నారని, వారు శిక్షణ తీసుకొని ఉపాధి పొందుతున్నారని వారికి అవసరమైన చేయూతను ఇవ్వాలని పేర్కొన్నారు. 2025-26కు సంబంధించిన వార్షిక క్రెడిట్ ప్లాన్‌ను బ్యాంకర్లతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.