Share News

ప్లాస్టిక్‌ వాడకాన్ని మానుకోవాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:22 AM

ప్లాస్టిక్‌ వాడకాన్ని స్వచ్ఛందంగా మానుకోవాలని జిల్లా ఇంచార్జి అధికారి, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్లాస్టిక్‌ వాడకాన్ని మానుకోవాలి
కొండారెడ్డి బురుజు ఎదురుగా శుభ్రం చేస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కలెక్టర్‌, ట్రైనీ కలెక్టర్‌, ఆర్‌డీఓలు

ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే

కర్నూలు న్యూసిటీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ వాడకాన్ని స్వచ్ఛందంగా మానుకోవాలని జిల్లా ఇంచార్జి అధికారి, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని కొండారెడ్డి బురుజు ఎదురుగా ఉన్న ఓపెన్‌ఎయిర్‌ ఆడిటోరియలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ పి.రంజిత్‌భాష, ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ మాట్లాడుతూ 30 ఏళ్ల కిందట మన ఇంటికి పెద్దవారు వచ్చినప్పుడు గొడుగు, చేతి సంచి, ఇత్తడి మరచెంబుతో వచ్చేవారని, ప్రస్తుత కాలంలో అవన్నీ వెళ్లి పోయి వాటి స్థానంలో ప్లాస్టిక్‌ వచ్చేసిందన్నారు. ప్లాస్టిక్‌ సంచులు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ వచ్చాయన్నారు. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలను ఆయన వివరిస్తూ ప్లాస్టిక్‌ కొన్ని వందల సంవత్సరాలయినా కూడా మట్టిలో కలిసిపోదన్నారు. అందువల్ల ప్లాస్టిక్‌ అవశేషాలు మనం తినే అన్ని రకాల ఆహర పదార్థాలలో చేరి, చాలా రకాల జబ్బులు వస్తున్నాయన్నారు. కాబట్టి ప్లాస్టిక్‌ను మన దైనందిన జీవితం నుంచి నిషేధించాలన్నారు. కలెక్టర్‌ రంజిత్‌ భాష మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత అని అన్నారు. చివరగా సమావేశంలో పాల్గొన్న వారిచే ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రతిజ్ఞ చేయించారు. నగర పాలక అధ్వర్యంలో రూపొందించిన పోస్టరును విడుదల చేశారు. స్వయం సహయక సంఘాల మహిళలు తయారు చేసిన ప్లాస్టిక్‌ రహిత భోజన ప్లేట్లు, నేలను శుభ్రం చేసే మాప్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ఈఈ సురేష్‌ డీటీసీ శాంతికుమారి, ఆర్‌టీఓ బర్హత్‌ చౌహన్‌, హెల్త్‌ ఆఫీసర్‌ కె.విశ్వేశ్వరరెడ్డి, ఆర్డీఓ సందీప్‌కుమార్‌, పత్తికొండ ఆర్డీఓ భరత్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:22 AM