ఆటో డ్రైవర్ హ్యాపీ
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:02 AM
ఆటో డ్రైవర్లలో ఆనందం రెట్టింపయింది. కష్టకాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయూతగా నిలిచారు.
ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున రూ.20.24 కోట్లు
జిల్లాలో 13,495 మందికి ఆర్థిక ప్రయోజనం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
‘ఆటో డ్రైవర్ల సేవలో’ రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లలో ఆనందం రెట్టింపయింది. కష్టకాలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయూతగా నిలిచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ పథకానికి శనివారం శ్రీకారం చుట్టారు. ఒక్కో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేశారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు ప్రారంభించారు. జిల్లాలో 13,495 మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.20.24 కోట్లు జమ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో రూ.15 వేలు జమ అయినట్లు సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు చూసి డ్రైవరన్నలు సంతోషం వ్యక్తం చేశారు. కొందరు డ్రైవర్ల కుటుంబాల్లో వృద్ధాప్య పింఛన్, ఇద్దరు ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం ఇప్పటికే వస్తోంది. తాజాగా ఆటో డ్రైవర్ల సేవలో.. పథకం రూ.15 వేలు జమయ్యాయి. ఈ మూడు పథకాలు ద్వారా ఒక్కో డ్రైవరన్న కుటుంబానికి ఏడాదికి రూ.93 వేలు నుంచి రూ.1.08 లక్షల మేరకు లబ్ధి చేకూరినట్లయింది. అత్యధికంగా కర్నూలు నియోజకవర్గంలో 5,169 మంది డ్రైవర్లకు రూ.7.75 కోట్లు జమ చేస్తే అత్యల్పంగా ఆలూరు నియోజవకర్గంలో 772 మంది ఆటో డ్రైవర్లకు రూ.1.16 కోట్లు జమ చేశారు. డ్రైవరు లేదా కుటుంబ సభ్యుల పేరిట సొంత వాహనం ఉండి, ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారిని అర్హులుగా గుర్తించారు. అయితే డ్రైవింగ్ లెసెన్స్ ఉన్నా, ఆర్థిక స్థోమత లేకనో, బ్యాంకుల్లో రుణాలు పుట్టకనో అద్దె ఆటోలు నడుపుకుంటున్న వారికి ఈ పథకం వర్తించడం లేదు. దీంతో తాము నష్టపోతున్నామని, అద్దె వాహనం నిడిపే డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తింప చేయాలని డ్రైవర్లు కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు
జిల్లా కలెక్టర్ డాక్టర్ అట్టాడ సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ప్రారంభించారు. 13,495 మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.20.24 కోట్లు జమ చేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడులు ప్రారంభించారు. 1,628 మందికి రూ.2.44 కోట్లు జమ చేశారు. ఆలూరులో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, హౌసింగ్ పీడీ చిరంజీవి, మార్కెట్ యార్డు చైర్మన్ బిల్లెకల్లు వెంకటేశ్ ప్రారంభించి 772 మంది ఖాతాల్లో రూ.1.16 కోట్లు జమ చేశారు. పత్తికొండలో స్పెషల్ ఆఫీసర్, ఆర్డీఓ భరత్ నాయక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, జడ్పీ మాజీ చైర్మన్ బత్తిని వెంకటరాముడు ప్రారంభించి 1,480 మందికి రూ.2.22 కోట్లు జమ చేశారు. మంత్రాలయంలో డీపీఓ భాస్కర్, టీడీపీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి, ఏపీ కురక కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ప్రారంభించి 1,172 మంది రూ.1.75 కోట్లు జమ చేశారు. కోడుమూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించి నియోజకవర్గంలో 2,440 మందికి రూ.3.66 కోట్లు జమ చేశారు. ఎమ్మిగనూరులో నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని ఎంవీఐ సుధాకర్‌రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశ్, సీనియర్ నాయకుడు భాస్కర్ల చంద్రశేఖర్ ప్రారంభించి 1,206 మందికి రూ.1.81 కోట్లు జమ చేశారు.
రూ.15వేలు ఎంతో ఉపయోగపడుతుంది
కూటమి ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలు మా ఆటో డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటోకు ఇన్సురెన్సుతో పాటు మెయింటేన్స్‌కు ఈ డబ్బును వినియోగిస్తాను. రోజువారిగా వచ్చే ఆదాయంతో మా జీవనం సాఫీగా సాగుతుంది. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
వీరేష్, శివన్ననగర్, ఎమ్మిగనూరు
సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్
ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మాకు రూ.15 వేలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఇది మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉన్న మహిళలు కూడా ఈ రంగంలోకి రావాలి. మాకు సాయం చేసిన సీఎం, కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్.
మహాలక్ష్మి, బి.అగ్రహరం, గోనెగండ్ల మండలం
జగన్ కన్నా రూ.5వేలు అధికంగా ఇచ్చారు
జగన్ ప్రభుత్వంలో రూ.10వేలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.15 వేలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ డబ్బు మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మేము నలుగురు కుటుంబ సభ్యులు. ఒక్కొసారి ఆటోకు గిరాకి ఉంటే ఉంటుంది.. లేకుంటే లేదు. ఇలాంటి సమయంలో ఈ డబ్బు మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు
నరసప్ప, ఆటోడ్రైవర్, ఎమ్మిగనూరు