న్యూడ్ కాల్స్‌తో ఆకర్షణ
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:02 PM
టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు మోసాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
తక్కువ ధరకే పొలాలు అమ్ముతామని మోసం
రూ.3.80 కోట్లు వసూలు
ముగ్గురు నిందితులు అరెస్టు
కర్నూలు క్రైం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు మోసాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మల్లేష్ (కల్వకుర్తి, నాగర్ కర్నూలు), పేరుమాళ్ల మేరీ (కల్వకుర్తి,నాగర్ కర్నూలు), మల్లిక అలియాస్ లిల్లి (నల్లగొండ జిల్లా, ప్రస్తుతం కల్వకుర్తి, నాగర్‌కర్నూలు)లను అరెస్టు చేసినట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో సోషల్ మీడియా వేదికగా పలు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సంయుక్తారెడ్డి అనే పేరుతో ఒక ట్విట్టర్ అకౌంటు ఓపెన్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా ప్రజలకు ఎర వేస్తున్నట్లు గుర్తించారు. కర్నూలు చెందిన ఓ వ్యాపారి వీరి వలలో చిక్కుకున్నాడు. ఆ వ్యాపారిని న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా ఆకర్షించి తక్కువ ధరకే విలువైన పొలాలు అమ్ముతామని నమ్మించారు. ఇలా పలు దఫాలుగా ఆ వ్యాపారిని నమ్మించి, బెదిరించి సుమారు రూ.3.80 కోట్లు వసూలు చేశారు. ఈ సొమ్ముతో రెండు కార్లు, మోటారు సైకిళ్లు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మరికొంత సొత్తుతో జల్సా చేశారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కార్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నామనీ సీఐ తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ విజ్ఞప్తి చేశారు.