మళ్లీ చొరబడేందుకు ప్రయత్నాలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:30 AM
: రైతుబజారు నుంచి బయటకు వెళ్లిపోయిన దళారులంతా మళ్లీ చొరబడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సిఫారసు లేఖలను రాయించుకుని వచ్చి సి.క్యాంపు రైతుబజారులో మళ్లీ తమకు చోటు కల్పించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు.
సిఫారసు లేఖలతో ప్రత్యక్షమైన దళారులు
రైతుబజారు సెక్యూరిటీ గార్డులపై దౌర్జన్యం
దళారులను హెచ్చరించిన పోలీసులు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతుబజారు నుంచి బయటకు వెళ్లిపోయిన దళారులంతా మళ్లీ చొరబడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సిఫారసు లేఖలను రాయించుకుని వచ్చి సి.క్యాంపు రైతుబజారులో మళ్లీ తమకు చోటు కల్పించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. మా స్థానంలో కూర్చున్న రైతులను బయటకు పంపాలని రైతుబజార్ ఎస్టేట్ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుండటంతో వారు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బుధవారం ఆత్మకూరు ఎమ్మెల్యే ఇచ్చిన సిఫారసు లెటరుతో ఓదళారి వచ్చి రైతును బయటకు పంపి తనకు చోటును కల్పించాలని ఎస్టేట్ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారంలో ఆ దళారి ఓ సెక్యూరిటీ గార్డుపై దౌర్జన్యానికి దిగారు. మరో దారి లేక త్రీటౌన్ పోలీ్‌సస్టేషన్ సీఐ శేషయ్యకు ఫిర్యాదు చేశామని ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ, హార్టికల్చర్ అసిస్టెంట్ శివకుమార్ విలేకరులకు తెలిపారు. సీఐ ఆదేశాలతో రైతుబజారుకు వచ్చిన పోలీసులు దళారులను హెచ్చరించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతుబజారులో మొదటి ప్రాధాన్యం రైతులకే కల్పించాలని, తర్వాత పొదుపులక్ష్మి మహిళలు, మిగిలినవారికి చోటు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిప్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా రైతుల పక్షాన నిలబడితే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.