Share News

కలెక్టర్‌గా అట్టాడ సిరి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:02 AM

కర్నూలు జిల్లా కలెక్టర్‌గా డాక్టర్‌ అట్టాడ సిరి నియమితులయ్యారు.

కలెక్టర్‌గా అట్టాడ సిరి
డాక్టర్‌ అట్టాడ సిరి

కలెక్టర్‌ రంజిత్‌బాషా బదిలీ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కర్నూలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కలెక్టర్‌గా డాక్టర్‌ అట్టాడ సిరి నియమితులయ్యారు. సెకండరీ హెల్త్‌ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెకు కలెక్టర్‌గా కూటమి ప్రభుత్వం ఇచ్చింది. శుక్రవారం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.రంజిత్‌బాషాను బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిరి విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నంలోనే సాగింది. విశాఖలోని ఆంరఽధా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్‌-1 రాసి తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. మొదట శ్రీకాకుళం జిల్లా పార్వతిపురం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీగా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో జేసీ-2గా పని చేశారు. 2015లో ఐఏఎస్‌గా ప్రభుత్వం పదోన్నతి లభించింది. 2020 మే 20 నుంచి 2022 ఏప్రిల్‌ 6 వరకు అనంపురం జిల్లా విలేజ్‌, వార్డు సచివాలయం జేసీగా పనిచేశారు. 2023 ఏప్రిల్‌ 6 వరకు స్ర్తీశిశు సంక్షేమం, అభివృద్ధి శాఖ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 2023 మే 24న సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అబాడి అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ స్పెషల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి 2024 ఆగస్టు 22వరకు ఆ హోదాలో కొనసాగారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 ఆగస్టు 22నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 15వరకు ఏపీఎస్‌ఏసీఎస్‌ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం సెకండరీ హెల్త్‌ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కలెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రంజిత్‌బాషా

కలెక్టరుగా పి.రంజిత్‌బాషా 2024 జూన్‌ 22న రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 15 నెలలు జిల్లా కలెక్టరుగా పనిచేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో ‘పల్లెకు పోదాం’లో భాగంగా పర్యటించిన రంజిత్‌బాషా అక్కడికక్కడే పలు సమస్యలు పరిష్కరించారు. ఓర్వకల్లు కేంద్రంగా పారిశ్రామిక నోడ్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వేదావతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు, హంద్రీనీవా ప్రాజెక్టు పందికోన రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువలు తక్షణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా చేయడంతో కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా పాత్ర ఎంతో ఉంది.

Updated Date - Sep 12 , 2025 | 12:02 AM