Share News

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:45 PM

అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ప్రయాణికురాలి బంధువులు దాడి చేసిన సంఘటన కర్నూలు నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి
ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉన్న ఆర్టీసీ బస్సు

బస్సు లైట్లు, అద్దాలు ధ్వంసం

కర్నూలు క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ప్రయాణికురాలి బంధువులు దాడి చేసిన సంఘటన కర్నూలు నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కండక్టర్‌పై దాడితో ఆగకుండా వీరంగం సృష్టించి బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా... అనంతపురం నుంచి కర్నూలుకు ఆర్టీసీ బస్సు బయల్దేరింది. డోన్‌లో ఓ మహిళ బస్సును ఎక్కింది. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో కండక్టర్‌ మురళీకృష్ణ అందరినీ వెనక్కు తోశారు. ఈ క్రమంలో ఆ ప్రయాణికురాలు ఆగ్రహంతో ఊగిపోయింది. తనపై చేయి వేస్తావా అంటూ కండక్టర్‌పై వాగ్వివాదానికి దిగింది. వివాదం పెద్దగా మారడంతో పంచాయతీ డోన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. అక్కడి పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పి పంపించేశారు. అయితే డోన్‌-కర్నూలు మధ్యలో కూడా ఆ ప్రయాణికురాలికి, కండక్టర్‌ మధ్య వాగ్వాదం ఏమాత్రం తగ్గలేదు. ఒకరిపై ఒకరు మరింత ఘర్షణ పడ్డారు. దీంతో ఆ ప్రయాణికురాలు కర్నూలులో ఉంటున్న తన కొడుకు, భర్తకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. ఆమె కొడుకు, స్నేహితులు వచ్చి గుత్తి పెట్రోల్‌ బంకు వద్ద బస్సు ఆపి కండక్టర్‌పై ముప్పేట దాడికి పాల్పడ్డారు. బస్సు లైటు అద్దాలను పగులకొట్టారు. ఒక్కసారిగా దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను ఫోర్త్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ప్రయాణికురాలు తనపై కండక్టర్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. అయితే రద్దీ అధికంగా ఉందని వెనక్కు వెళ్లాలని తాను గట్టిగా చెప్పానని కండక్టర్‌ మురళీకృష్ణ చెబుతున్నాడు. అయితే ఒకరిపై ఒకరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈఘటనపై పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:45 PM