Share News

పంటల బీమాతో భరోసా

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:04 AM

: పంటల బీమా పథకంతో రైతన్నలకు భరోసా లభిస్తోంది. అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్‌ ద్వారా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి.

పంటల బీమాతో భరోసా

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధం

కౌలురైతులు కూడా అర్హులే

ప్రీమియం చెల్లింపునకు వరికి వచ్చేనెల 15 వరకూ

మిగిలిన పంటలకు ఈనెల 31వ తేదీ వరకు గడువు

సద్వినియోగం చేసుకోండి

డోన్‌ టౌన్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పంటల బీమా పథకంతో రైతన్నలకు భరోసా లభిస్తోంది. అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్‌ ద్వారా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో పంట నష్టం కలిగితే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఖరీఫ్‌ సాగులో ఈ పథకాన్ని అమలులోకి తెచ్చాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాలో అమలులోకి తీసుకురాగా అందులో నంద్యాల జిల్లా కూడా ఉంది. జిల్లాలో కొర్రలు, కందులు, సజ్జలు, మొక్కజొన్న, పత్తి, అరటి, వేరుశనగ, వరి పంటలు మాత్రమే ఈ పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పించారు. వరికి రూ.800 ప్రీమియం చెల్లిస్తే రూ.40వేలు బీమా రైతులకు దక్కుతుంది. ఎకరా కొర్రలకు రూ.160లు ప్రీమియం చెల్లిస్తే రూ.16వేలు, కందులకు రూ.140 చెల్లిస్తే రూ.20వేలు, సజ్జలకు రూ.160లు చెల్లిస్తే రూ.16వేలు, మొక్కజొన్నకు రూ.660 చెల్లిస్తే బీమా రూ.35వేలు వర్తిస్తుంది. పత్తికి రూ.1600 చెల్లిస్తే రూ.40వేలు, అరటికి రూ.2,750లు చెల్లిస్తే రూ.55వేలు, వేరుశనగకు రూ.560 చెల్లిస్తే రూ.28వేలు బీమా ఉంటుంది. వీటన్నింటికీ ఈనెల 31లోపు ప్రీమి యం చెల్లింపు చేసినవారికే ఈ పథకాలు వర్తిస్తాయి. వరికి మాత్రం రూ.800 చెల్లించేందుకు వచ్చేనెల 15వరకు గడువు ఉంటుంది. తుపాన్‌, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పంట నష్టపోయిన రైతులను ఆదరించడం ఈ పథకం ప్రధాన ముఖ్య ఉద్దేశ్యం. పంట నష్టం అంచనా వేసి బీమాను వర్తింపజేస్తారు. పంటలు సాగుచేసుకున్న రైతులు, కౌలురైతులు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులు అని ఏడీఏ సునీత సూచించారు.

పంటల బీమాను రైతులు సద్వినియోగిం చుకోవాలి.

బ్యాంకు నుంచి పంట రుణం పొందిన రైతులు వారు రుణం తీసుకునే సమయంలో బీమా ప్రీమియం మొత్తాన్ని రైతుల నుంచి తీసుకుని వారే బీమా కంపెనికి జమ చేస్తారు. బీమా పరిహారం వచ్చిన సమయంలో ఆ బీమా మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేస్తారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోని, పంట రుణాలు తీసుకోని వారు సచివా లయాలు, మీసేవ, రైతుసేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు. - సునీత, ఏడీఏ, డోన్‌

Updated Date - Jul 29 , 2025 | 12:04 AM