Share News

నిబంధనలకు పాతర

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:06 AM

నిబంధనలకు పాతర

నిబంధనలకు పాతర
తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు

ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌...

మన రాష్ట్రం నుంచి ఆపరేషన్‌

కర్నూలులోనూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ హవా

రవాణా శాఖ అధికారుల దాడుల్లో పలు విషయాలు వెలుగులోకి

కాస్తంత సుఖంగా ప్రయాణించాలని ఎవరైనా అనుకుంటారు. పది రూపాయలు ఎక్కువ ఖర్చు చేయగలవాళ్లు అందుకు తగిన సౌకర్యాలు కోరుకుంటారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ అక్కడ మొదలవుతుంది. ఆకర్షణీయమైన హంగులు ఉండే ట్రావెల్స్‌ వేగంగా గమ్యం చేర్చుతాయనే నమ్మకం కూడా తోడైంది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్‌ యజమానులు బస్సులు నడిపి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇటీవల కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం అనేక విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా కర్నూలు కేంద్రం గా నడిచే ట్రావెల్స్‌ బస్సుల లోగుట్టు ఇలా ఉంది...

కర్నూలు క్రైం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ట్రావెల్స్‌ హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేట్‌ బస్సుల్లో ఎంత భద్రత ఉందనే కోణంలో చర్చ జరుగుతోంది. అసలు ఈ బస్సులకు ఎందుకింత డిమాండ్‌ ఉంది? బస్సులో ఉన్న సౌకర్యాలేమిటి? అనే కోణంలో సాధారణ ప్రజలు ఆరా తీస్తున్నారు. గత ఐదారేళ్లుగా ఈ ట్రావెల్స్‌ బిజినెస్‌ విపరీతంగా పెరిగింది. బెంగళూరు టూ హైదరాబాదు, అనంతపురం-కర్నూలు-విజయవాడ, ఆదోని- విజయవాడ, హైదరాబాదు-తిరుపతి ఇలా వందలాది ట్రావెల్‌ బస్సులు కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నాయి. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు హైవేలో గమనిస్తే వీటి స్పీడ్‌ విపరీతంగా ఉంటుంది. పెద్ద పెద్ద బస్సులు కర్టన్లు, ఏసీ కూపేలతో, ఆకర్షణీయమైన బయట రంగులతో, బొమ్మలతో.. ఇలాంటి పెద్ద బస్సులో ఒక్కసారైనా ప్రయాణించాలని ఎవరైనా అనుకుంటారు. ఒక్కసారి ప్రయాణించాక.. అందులో ఉన్న సౌకర్యాలు, ఏసీ, కర్టన్లు, దుప్పటి, వాటర్‌బాటిళ్లకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ట్రావెల్స్‌ విపరీతంగా పెరిగాయి.

ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎక్కడ రిజిస్ర్టేషన్‌ జరిగినా ఫిజికల్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా కంపెనీ మాన్యువల్‌లో రూపొందించి ఉంటేనే బస్సు రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది. మరో వైపు అన్ని నిబంధనల ప్రకారం ఉంటే .. ఇక్కడ ట్రావెల్స్‌ నడపాలంటే ఒక్కో సీటుకు రూ.4వేల చొప్పున ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్‌ రూపంలో చెల్లించాలి.. ఇది ట్రావెల్స్‌ యజమాన్యానికి కొంత భారమే. దీంతో ఐదారేళ్ల కింద మోటారు వాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని మార్పులను వీరు అడ్డం పెట్టుకున్నారు. గతంలో ఏ రాష్ట్రంలో రిజిస్ర్టేషన్‌ జరిగితే.. ఆ రాష్ట్రం బార్డర్‌లో కొంతైనా ప్రయాణం చేయాలనే నిబంధన ఉండేది. అయితే.. సడలించిన నిబంధనలతో రిజిస్ర్టేషన్‌ జరిగిన రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాహనాలు నడుపుకోవచ్చనే కొన్ని మార్పులతో ట్రావెల్స్‌ యాజమాన్యం అతి తక్కువ ఫీజులు ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలైన నాగాలాండ్‌, డామన్‌ డయ్యూలకు వెళ్తున్నారు. అక్కడ నామమాత్రంగానే ఫీజులు ఉంటాయి..

ట్రావెల్‌ బస్సులపై గత పది నెలల్లో 186 కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ అధికారులు భారీ ఎత్తున తనిఖీలు చేసి జరిమానా వేశారు.

నెల కేసులు

జనవరి 05

మార్చి 17

మే 57

జూన్‌ 10

జూలై 08

ఆగస్టు 21

సెప్టెంబరు 17

అక్టోబరు10కి 51

మొత్తం 186

కేసుల వివరాలు ఇవి

రికార్డులు లేనివి : 11

ఎమర్జెన్సీ డోర్లు లేనివి : 01

ఫైర్‌ సేఫ్టీ లేనివి : 9

డ్రైవింగ్‌ లైసెన్సు లేని కేసు : 01

ఓవర్‌ స్పీడ్‌ : 3

నో రిఫ్లక్టెర్స్‌ : 4

ఫిట్‌నెస్‌ లేని వాహనాలు : 2

వాణిజ్య సరుకులు రవాణా వాహనాలపై : 33

లైటింగ్‌ ఫోక్స్‌ అధికంగా ఉన్నవి : 54

పర్మిట్లు లేని వాహనాలు : 8

విండ్‌ షీల్డ్‌ లేనివి : 23

ట్యాక్స్‌ చెల్లించని వాహనాలు : 15

కర్నూలులోనూ ట్రావెల్స్‌ హవా:

కర్నూలు జిల్లాలో మొత్తం 15 ట్రావెల్స్‌ బస్సులు ఉన్నాయి. వీటిలో ఏపీ రిజిస్ర్టేషన్‌తో 12 బస్సులు ఉన్నాయి. అందులో 11 ఆదోని రిజిస్ర్టేషన్‌తో ఉండగా.. ఒకటి కడప రిజిస్ర్టేషన్‌తో ఉంది. మూడు ఇతర రాష్ట్రాల రిజిస్ర్టేషన్‌తో కర్నూలు కేంద్రంగా ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నారు. రెండు నాగాలాండ్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోగా.. మరో బస్సు అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. కానీ హైదరాబాదు, బెంగుళూరు, హైదరాబాదు- తిరుపతి మధ్య తిరుగుతున్నాయి. షబానా ట్రావెల్స్‌, జేఎస్‌ ట్రావెల్స్‌, శ్రీనివాస ట్రావెల్స్‌ ఇవి కర్నూలు కేంద్రంగా ఉన్న ట్రావెల్స్‌.

నిబంధనలకు పాతర:

ఇటీవల వేమూరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనతో అసలు ఈ ట్రావెల్‌ బస్సుల యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నాయి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రయాణికుల ఒకటో, రెండో లగేజీ బ్యాగులు తీసుకెళ్లాల్సిన ట్రావెల్స్‌ బస్సులు మొత్తం వాణిజ్య సరుకులనే సరఫరా చేస్తున్నాయి. ప్రయాణికుల టికెట్‌తో వచ్చే లాభం కంటే ఈ రవాణా వల్ల వచ్చే లాభం అధికంగా ఉంటుంది. బస్సు కింద ఉండే ట్రావెల్‌లో పైన ఉన్న ప్రయాణికుల కంటే ఎక్కువ లోడ్‌ వేస్తున్నారు. వీటిలో అగ్ని మాపక శాఖ పరికరాలు కానీ, ఎమర్జెన్సీ డోర్లు కానీ ఉండటం లేదు. దీనికి తోడు అత్యవసర సమయాల్లో అద్దాలు పగలకొట్టేందుకు ఉండాల్సిన చిన్నపాటి సుత్తెలు కూడా అందుబాటులో ఉండటం లేదని గుర్తించారు. ఈ ట్రావెల్‌ బస్సులన్నీ టూరిస్టు బస్సులుగా రిజిస్ర్టేషన్‌ చేసుకుంటారు. కాంట్రాక్టు క్యారేజ్‌ మాత్రమే తీసుకెళ్లాలి. అంటే ఓ సమూహ ప్రయాణికులను ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లేందుకు అనుమతులు ఉంటుంది. అయితే వ్యక్తిగత టికెట్లు మాత్రమే వసూలు చేస్తున్నారు.

తనిఖీలో వెల్లడైన నిజాలు :

కొన్ని బస్సులకు సరైన రికార్డులు లేవు.

ఎమర్జెన్సీ బటన్‌ అలారం, డోర్‌ కూడా ఉండటం లేదు

వర్షాకాలంలో అద్దాలు తుడిచేందుకు ఉపయోగించే విండ్‌షీల్డ్‌ కూడా లేవు.

అత్యవసర అద్దాలు పగులకొట్టే సుత్తెలు, మంటలు ఆర్పే పరికరాలు లేవు.

ప్రయాణికుల లిస్టు కూడా సరిగ్గా మెయిన్‌టెనెన్స్‌ చేయడం లేదు

డ్రైవర్లు అత్యాశతో మధ్య మధ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు

అతివేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు.

సరైన అనుభవం, శిక్షణ ఉన్న డ్రైవర్లను కూడా నియమించుకోవడం లేదు.

మారనీ తీరు :

కావేరీ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 19 మంది మృతి చెందిన ట్రావెల్స్‌ యాజమాన్యంలో కాసింత మార్పు కూడా కనిపించడం లేదు. తమను ఎవరు ఏం చేస్తారనే ధీమాతో నిబందనలకు పాతర వేసి వాహనాలు నడుపుతున్నారు. గత మూడు రోజులుగా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తుండగా.. కేసులు నమోదు చేస్తున్నా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడు రోజులుగా రవాణా శాఖ అధికారులు కర్నూలు జిల్లాలోనే 63 కేసులు నమోదు చేశారు.

దాడులు ముమ్మరం చేస్తాం

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉంటాం. ఎలాంటి అనుమతులు లేకుండా అగ్ని మాపక సహాయ పరికరాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. పలుసార్లు తప్పులు చేస్తే వాహనాలు సీజ్‌ చేసేందుకు వెనుకాడబోం. అనధికారిక ఆల్ర్టేషన్‌తో తిరుగుతున్న రెండు బస్సులను సీజ్‌ చేశాం. దాడులను మరింత ఉధృతం చేస్తాం.

- శాంత కుమారి, డీటీసీ, కర్నూలు

Updated Date - Oct 28 , 2025 | 12:06 AM