మే ఆఖరిలోగా గేట్లు అమర్చాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:16 AM
తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ఏర్పాటులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు... అవసరానికి మించి సిబ్బందిని నియమించి మే ఆఖరిలోగా 33 గేట్లు అమర్చాలని తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు (టీబీపీ) తీర్మానం చేసింది
తుంగభద్ర బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం
కర్నూలు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ఏర్పాటులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు... అవసరానికి మించి సిబ్బందిని నియమించి మే ఆఖరిలోగా 33 గేట్లు అమర్చాలని తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు (టీబీపీ) తీర్మానం చేసింది. సోమవారం బోర్డు అధ్యక్షుడు ఎస్‌ఎం పాండే అధ్యక్షతన తుంగభద్ర బోర్డు సమావేశం జరిగింది. బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్, ఏపీ సభ్యులు కృష్ణమూర్తితో పాటు కర్ణాటక, తెలంగాణ సభ్యులు కూడా హాజరయ్యారు. తుంగభద్ర గేట్లు ఏర్పాట్లు, నీటి పంపకాలు అంశాలపై ప్రధానంగా చర్చించారు. గత ఏడాది తుంగభద్ర డ్యాం 19వ నెంబరు నీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. డ్యాం భద్రతపై పలు అనుమానాలు తలెత్తడంతో కేంద్ర జలసంఘం (సీడబ్లూసీ), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), డ్యాం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన ఏకే బజాజ్ కమిటీల సిఫారసు మేరకు గేట్లు, ప్రాజెక్టు సామర్థ్యంపై తుంగభద్ర బోర్డు అధ్యయనం చేయించింది. మొత్తం 33 గేట్లు మార్చాల్సిందే అంటూ అధ్యయన సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు రూ.44 కోట్లతో గేట్ల ఏర్పాటుకు బోర్డు టెండర్‌కు పిలవగా.. గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ సంస్థ పనులు దక్కించుకుంది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. గేట్ల ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది రైతులు రబీ సీజన్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో రాబోయే ఏడాది ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని బోర్డు సభ్యులు సూచించారు. ఈ ఏడాది తరహాలో 2026 నీటి సంవత్సరంలో కూడా ముందస్తు వర్షాలు, వరదలు వస్తే.. గేట్ల ఏర్పాటుకు ఇబ్బంది రాకుండా మే ఆఖరిలోగా 33 గేట్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చైర్మన్ పాండే సూచించారు. అవసరమైన బేరింగ్‌లు కూడా జపాన్ నుంచి వెంటనే దిగుమతి చేయించుకోవాలని బోర్డు సమావేశంలో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో మే నెలాఖరులోగా గేట్లు అమర్చే పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.