Share News

తూములు తవ్వరా..?

ABN , Publish Date - May 03 , 2025 | 11:21 PM

కళ్లముందే కృష్ణా జలాలు కదలిపోతున్నాయి.

తూములు తవ్వరా..?
హంద్రీనీవా కాలువ విస్తరణ పనుల్లో యంత్రాలు

రూ.690 కోట్లతో హంద్రీనీవా కాలువ విస్తరణ

జూన్‌ ఆఖరికి పూర్తి చేయాలని మంత్రి నిమ్మల ఆదేశం

ఉమ్మడి జిల్లాలో 18 తూములు ఏర్పాటుకు ప్రతిపాదన

అదనంగా 16,908 ఎకరాలకు సాగునీరు

పత్తికొండ జలాశయం స్లూయిస్‌ విస్తరణ అంతేనా..?

కళ్లముందే కృష్ణా జలాలు కదలిపోతున్నాయి. మెట్ట పొలాలకు మళ్లిస్తే కరువునేల సస్యశాలమం అవుతుంది. రైతు ముంగిట ధాన్యరాశులు నిండుతాయి. అదిజరగాలంటే హంద్రీనీవా కాలువకు అవసరమైన ప్రాంతాల్లో తూము (స్లూయిస్‌)లు ఏర్పాటు చేయాలి. పంట కాలువలు తవ్వి సాగునీరు అందించాలి. అదే జరిగితే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అదనంగా 16,908 ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. భూగర్భజలాలు పెరిగి.. బోరుబావుల కింద సాగు విస్తీర్ణం పెరుగుతుంది. రూ.690 కోట్లతో హంద్రీనీవా కాలువను 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులతో పాటు 18 గ్రామాల వద్ద కరువు నేలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా తూములు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా యంత్రాలలో విస్తరణ పనులు చేస్తున్నారు. ఆ తరువాత స్లూయిస్‌లు ఏర్పాటు చేయడం అసాధ్యం. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తూములు తవ్వాలి. లేదంటే కరువు రైతులకు మిగిలేది కన్నీళ్లే. అదే క్రమంలో పత్తికొండ జలాశయం స్లూయిస్‌ విస్తరించకపోవడం రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు, మే 3 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ కరువు పల్లెసీమల జలప్రదాయిని హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం. శ్రీశైలం డ్యాం ఎగువన 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05లక్షల ఎకరాలకు సాగునీరు, 35లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. ఫేజ్‌-1 నందికొ ట్కూరు మండలం మాల్యాల ప్రధాన మాల్యాల లిఫ్ట్‌ 0/0 నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలోమీటర్ల మేర కాలువ తవ్వారు. 8 లిఫ్టులు ఏర్పాటు చేశారు. 12 పంపుల ద్వారా 3,850 క్యూసెక్కులు పోసి ఖరీఫ్‌ సీజన్‌లో 40 టీఎంసీలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కాలువ 2 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కూడా లేదు. ఈ లెక్కన 20-25 టీఎంసీలకు మించి తీసుకోలేని పరిస్థితి ఉంది. ఏటా 15-20 టీఎంసీలు నష్టపోవాల్సి వస్తుంది. కృష్ణా నదీ వరద జలాలు కడలి పాలు అవుతున్నా.. కరువు రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. పూర్తిస్థాయి వరద జలాలు రాయలసీమ జిల్లాలకు మళ్లించాలనే సంకల్పంతో గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.1,030 కోట్లతో.. 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి విస్తరణ పనులు చేపట్టారు. దాదాపు రూ.285.77 కోట్లు ఖర్చు చేశారు. 2019 మేలో కొలువుదీరిన జగన్‌ ప్రభుత్వం విస్తరణ పనులకు బ్రేక్‌ వేసింది. మళ్లీ ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు హంద్రీనీవా విస్తరణ పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. జూన్‌ నెలాఖరులోగా ఫేజ్‌-1 పరిధిలో బ్యాలెన్స్‌ (మిగులు) పనులు రూ.690 కోట్లతో చేపట్టి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు లక్ష్యంగా శరవేగంగా పనులు చేస్తున్నారు.

29 వేల ఎకరాలకు మించి లేనట్టే

జిల్లాలో హంద్రీనీవా కాలువ ద్వారా పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువ కింద 61,400 ఎకరాలు, కృష్ణగిరి జలాశయం కింద 5,090 ఎకరాలు, కాలువ పొడవున తూములు (స్లూయిస్‌) ద్వారా 13,500 ఎకరాలు చొప్పున 80 వేల సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం 29 వేల ఎకరాలకు మించి సాగునీరు ఇవ్వడం లేదు. పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులు పూర్తిచేస్తే ఆయకట్టుకు సాగునీరు ఇవ్వవచ్చు. ఆ దిశగా చర్యలు శూన్యం. కళ్ల ముందే కృష్ణా జలాలు తరలిపోతుంటే నిత్యం కరువు. వలసలతో తల్లడిల్లే కర్నూలు జిల్లా కరువు రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు.

పత్తికొండ రిజర్వాయర్‌ స్లూయిస్‌ విస్తరించరా..?

పత్తికొండ (పందికోన) జలాశయానికి నీటిని మళ్లించేందుకు హంద్రీనీవా కాలువకు ఇన్‌లెట్‌ స్లూయిస్‌ ఏర్పాటు చేశారు. అలాగే కుడి, ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు రెండు అవుట్‌లెట్స్‌ స్లూయిస్‌లు ఏర్పాటు చేశారు. అవుట్‌లెట్‌ స్లూయిస్‌ కంటే ఇన్‌లెట్‌ స్లూయిస్‌ సామర్థ్యం ఎక్కువగా ఉండాలని లేదా సమానంగానైనా ఉండాలని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌లెట్‌ తూమును 428.72 క్యూసెక్కులు (12.14 క్యూమెక్స్‌) ప్రవాహ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. జలాశయం నుంచి ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు కుడి కాలువ అవుట్‌లెట్‌ తూము 670.98 క్యూసెక్కులు (19 క్యూమెక్స్‌), ఎడమ కాలువ అవుట్‌లెట్‌ తూము 141.26 క్యూసెక్కులు (4 క్యూమెక్స్‌) కలిపి రెండు అవుట్‌లెట్‌ తూములు 811.24 క్యూసెక్కులు (23 క్యూమెక్స్‌) సామర్థ్యం ఏర్పాటు చేశారు. అంటే అవుట్‌లెట్‌ స్లూయిస్‌ కంటే.. ఇన్‌లెట్‌ స్లూయిస్‌ 382.52 క్యూసెక్కులు (10.86 క్యూమెక్స్‌) తక్కువ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ఇది ఇంజనీరింగ్‌ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఇంజనీర్లు అంటున్నారు. అలాగే వాటర్‌గ్రిడ్‌లో భాగంగా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో వివిధ గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు 0.650 టీఎంసీలతో డీపీఆర్‌ తయారు చేశారు. దీంతో ఇన్‌లెట్‌ స్లూయిస్‌ సామర్థ్యాన్ని 25 క్యూమెక్స్‌ (882.87 క్యూసెక్కులు)లకు పెంచాలని, లేదంటే భవిషత్తులో పత్తికొండ జలాశయం తాగునీరు అందించే ఎస్‌ఎస్‌ ట్యాంక్‌గా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

18 తూములతో మరో 16,908 ఎకరాలకు సాగునీరు

జిల్లాలో హంద్రీనీవా కాలువ పరిధిలో ప్రస్తుతం కేవలం నాలుగు స్లూయిస్‌ మాత్రమే ఉన్నాయి. 22.02 కి.మీల నుంచి 141.375 కి.మీల వరకు కాలువ వెంబడి 18 తూములు తవ్వితే.. దాదాపు 56 గ్రామాల్లో 16,908 ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వవచ్చు. అంతేకాదు భూగర్భ జలాలు పెరగడం ద్వారా బోరుబావుల కింద సాగు విస్తీర్ణం పెరుగుతుంది. గ్రామాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు, పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, కేఈ శ్యాంబాబులు ప్రభుత్వాన్ని ఒప్పించి తూములు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. విస్తరణ పనులు పూర్తిచేస్తే.. ఆ తరువాత తూములు ఏర్పాటుకు ఏమాత్రం అవకాశం ఉండదు.

హంద్రీనీవా కాలువకు తూములు ఏర్పాటు డిమాండ్‌,

అదనపు ఆయకట్టు (ఎకరాలు) వివరాలు

తూము ప్రతిపాదన కిలో మీటరు లబ్ధిపొందే అదనపు

గ్రామం వద్ద గ్రామాలు ఆయకట్టు

(ఎకరాలు)

గార్గేయపురం -2 22.02, 23.23 6 1,015

నాయకల్లు -- 6 500

తొగరచేడు -- 5 700

మల్లికార్జునపల్లె 57.145 1 300

లద్దగిరి 58.90 1 300

నార్లాపురం 61.50 4 1,000

ఎర్రగుడి 67.50 5 2,500

కంబాలపాడు 81.142 1 1,297

కుర్మగిరి 90.104 1 1,875

పెనుమాడ 91.831 2 621

దూదేకొండ 113.615 3 1,200

హోసూరు 123.40 3 1,250

బూరుజుల 130.032 3 750

పెరవలి 134.602 3 600

బొమ్మనపల్లి, హంప 136.755 7 1,500

మద్దికెర 141.375 5 1,500

మొత్తం -- 56 16,908

కొత్త తూములకు ప్రభుత్వ అనుమతి కావాలి

హంద్రీనీవా కాలువ ఫేజ్‌-1 కింద కర్నూలు జిల్లాలో కాలువ విస్తరణ బ్యాలెన్స్‌ పనులు రూ.690 కోట్లతో చేపట్టాం. ఇప్పటివరకు 20 శాతం పనులు పూర్తయ్యాయి. విస్తరణలో భాగంగా ఆయా గ్రామాల దగ్గర కొత్తగా తూములు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, రైతులు కోరుతున్న మాట నిజమే. కొత్త తూములు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి. పత్తికొండ జలాశయం ఇన్‌లెట్‌ స్లూయిస్‌, అవుట్‌లెట్స్‌ స్లూయిస్‌ మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. అదనపు ఇన్‌లెట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

- నాగరాజు, సీఈ, హంద్రీనీవా ప్రాజెక్టు, అనంతపురం

Updated Date - May 03 , 2025 | 11:21 PM