Share News

పశు బీమాకు నిధులేవీ?

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:52 PM

పశు పోషకులకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది.

పశు బీమాకు నిధులేవీ?
ఎమ్మిగనూరు సంతకు వచ్చిన పశువులు

ఆగిపోయిన ప్రీమియం చెల్లింపు

ప్రభుత్వం నిధులిస్తేనే రైతులకు ధీమా

జిల్లాలో ఆవు, గేదె జాతి పశువులు 3.36 లక్షలు

18.12 లక్షల గొర్రెలు, మేకలు

ప్రీమియం చెల్లించినది 14,418 పశువులకే

పశు పోషకులకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. రైతులకు ధీమా ఇవ్వాలనే ఆశయంతో ‘పశు బీమా పథకం’ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రీమియం చెల్లింపు కోసం జిల్లాకు రూ.11లక్షలు మంజూరు చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖాళీ అవడంతో.. పశువులకు బీమా చేద్దామని వెళ్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. ఈ పథకం అమలు తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. రైతులు ప్రత్యామ్నాయ జీవనాధారంగా పశు పోషణ, పాడి, గొర్రెలు, మేకల పెంపకం చేస్తున్నారు. పలు గ్రామాల్లో పాడి పశువుల పోషణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. పశు గణన లెక్కల ప్రకారం జిల్లాలో ఆవు, గేదె జాతి పశువులు 3.36 లక్షలు, గొర్రెలు, మేకలు 18.12 లక్షలకుపైగా ఉన్నాయని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. పాతికేళ్ల కిందటితో పోలిస్తే పశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కారణం.. పశ్చిమ ప్రాంత పల్లెసీమల్లో వెంటాడే కరువు, దుర్భిక్ష పరిస్థితులే. వేసవిలో పశుగ్రామం కొరత కారణంగా మెజార్టీ రైతులు పశువులను సంతలో అమ్మేస్తున్నారు. అయినా.. పలువురు రైతులు పాడి ఆవులు, గేదెలు పోషణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో గొర్రెలు, మేకలు పెంపకం వృత్తిగా పలువురు జీవనం సాగిస్తున్నారు. పశు పోషకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ నిధులతో రాయితీపై మినీ గోకులాల నిర్మాణం, పశుగ్రాసం, పశు గ్రాసం పెంపకానికి విత్తనాలు పంపిణీ చేస్తున్నది.

పశు బీమా పథకం అమలు

ప్రకృతి వైపరీత్యాలు (తుఫాన్లు, వరదలు, పిడుగుపాటు) వల్ల పశువులు చనిపోతే ప్రభుత్వం ‘పశు నష్టపరిహారం’ కింద ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. ఈ పరిహారం పొందాలంటే రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ‘పశు బీమా పథకం’ అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రీమియం చెల్లింపు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాకు రూ.11 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల వరకు వర్తిస్తుంది. దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్న రైతు కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.30 వేల వరకు విలువైన పశువులకు చెల్లించే ప్రీమియంలో ప్రభుత్వం 85 శాతం, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న రైతులకు 50 శాతం రాయితీ ఇస్తారు. రాయితీ అమౌంట్‌ పోను మిగిలిన మొత్తం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పశువులకు రూ.15 వేలు బీమా కోసం నిర్ణయించిన ప్రీమియం రూ.960 కాగా ప్రభుత్వం వాటా రూ.816, రైతు వాటా రూ.149 చెల్లించాలి. రూ.30 వేలు బీమాకు ప్రీమియం రూ.1,920 కాగా, ప్రభుత్వం వాటా రూ.1,632, రైతు వాటా రూ.298 చెల్లించాలి. గొర్రెలు, మేకలకు రూ.6 వేలకు ప్రీమియం రూ.375లకు గాను ప్రభుత్వ వాటా రూ.320 కాగా రైతులు రూ.55 చెల్లించాలి. పాడి, వ్యవసాయంలో తోడుగా ఉండే కాడెద్దుల పోషణ రైతులు, మూగజీవాల పెంపకందారులకు బీమా కొండంత ధీమా ఇస్తుంది. బీమా చేసిన పశువులు మృత్యువాత పడితే రూ.15-30 వేల వరకు బీమా పరిహారం అందుతుంది. ఒక కుటుంబానికి గరిష్టంగా 10 పశువులు, 50 గొర్రెలు, మేకలకు పశు బీమా వర్తిస్తుంది.

నిధుల కొరతతో ఆగిన బీమా పథకం:

పశు పోషణ జీవనాధారంగా బతుకుతున్న పలువురు రైతులకు పశు బీమా పథకం ధీమా ఇస్తుందనుకుంటే నిధుల కొరత వెంటాడుతుంది. జిల్లాకు రూ.11 లక్షలు మంజూరు చేశారు. జిల్లాలో 3,36,384 పశు సంపద ఉందని పశు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.15 వేల బీమా కోసం వంద శాతం పశువులకు ప్రీమియం చెల్లించాలంటే ప్రభుత్వ వాటా కింద రూ.27.45 కోట్లు అవుతుంది. ఒక కుటుంబానికి పది పశువులకే పరిమితం పెట్టడం వల్ల కేవలం 30 శాతం పశువులకు బీమా చేయాలన్నా రూ.4.12 కోట్లు చెల్లించాలి 18.12 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఒక్కొ కుటుంబం గరిష్టంగా 50 గొర్రెలు, మేకలకే బీమా ప్రీమియం చెల్లించాలి. మొత్తం గొర్రెలు, మేకల్లో పది శాతం వాటికి బీమా చేయాలన్నా ప్రభుత్వం వాటా ప్రీమియం రూ.5.80 కోట్లు అవసరం. అంటే.. జిల్లాలో ఉన్న పశు సంపదలో 15 శాతం, గొర్రెలు, మేకలకు పది శాతం బీమా చేయాలన్నా, ప్రభుత్వ వాటా ప్రీమియం రూ.9.50-10 కోట్లు అవసరం ఉంటుందని అంచనా. అయితే.. ప్రభుత్వం మంజూరు చేసింది కేవలం రూ.11 లక్షలే. దీంతో 14,418 పశువులు, గొర్రెలు, మేకలకు మాత్రమే బీమా చేశారు. ఖాతాలో నిధులు ఖాళీ కావడంతో రెండు నెలలుగా పశు బీమా ప్రీమియం చెల్లింపులు ఆపేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత వల్లనో, మరే ఇతర కారణంగానో ఈ పథకంపై రైతుల్లో అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణులు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పథకంపై రైతుల్లో సంపూర్ణ అవగాహన కలిగించాలి. ప్రతి రైతు పశు బీమా చేసేలా చర్యలు తీసుకోవాలి.

308 పశువులకు బీమా పరిహారం

జిల్లాలో పశు బీమా పథకం కింద నమోదు చేసిన 406 పశువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. 375 పశువులకు బీమా పరిహారం మంజూరు కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. 308 దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలిపారు. వివిధ కారణాలతో 16 తిరస్కరించారు. రెండింటిని వెనక్కి పంపించారు. మరో 13 పశువులకు ప్రతిపాదన దశలో ఉన్నాయి. బీమా పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుంది.

పశు బీమా రైతులకు వరం

పశు బీమా పథకం రైతులకు ప్రభుత్వం ఇచ్చిన వరం. పశు పోషణ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో ఈ పథకంపై రైతుల్లో చైతన్యం, సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నాం. పశు చికిత్స శిబిరాలోనే కాకుండా పల్లెసీమల్లో ఏ కార్యక్రమం జరిగినా రైతులకు బీమా గురించి వివరిస్తున్నాం. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రీమియం రాయితీ నిధులు రూ.11 కోట్లు అయిపోయాయి. నిధులు రాగానే మళ్లీ బీమా ప్రక్రియ ప్రారంభిస్తాం.

- డాక్టర్‌ వి. హేమంత్‌ కుమార్‌, ఇన్‌చార్జి జేడీ, పశు సంవర్ధక శాఖ, కర్నూలు

జిల్లాలో పశు సంపద వివరాలు

పశువుల రకం సంఖ్య

ఆవు జాతి 2,21,934

గేదె జాతి 1,14,451

గొర్రెలు 14,81,145

మేకలు 3,31,764

కోళ్లు 8,04,641

కుక్కలు 11,604

పందులు 11,698

బీమా చేసిన

పశువులు 14,418

Updated Date - Nov 07 , 2025 | 11:52 PM