జిల్లా ఆశలు అడియాశలేనా?
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:47 PM
నిత్యం కరువుతో తల్లడిల్లుతున్న పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ‘ఆదోని జిల్లా’ ఏర్పాటే ఏకైక పరిష్కారం అని ఇక్కడి ప్రజలు నినదిస్తున్నారు.
రెండు మండలాలుగా ఆదోని
కొత్తగా పెద్దహరివాణం మండలం
స్పష్టత ఇచ్చిన మంత్రివర్గ ఉప సంఘం
ఏ మండలంలో ఏ గ్రామాలు?
ఢిల్లీలో పావులు కదుపుతున్న ఎమ్మెల్యే
నిత్యం కరువుతో తల్లడిల్లుతున్న పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ‘ఆదోని జిల్లా’ ఏర్పాటే ఏకైక పరిష్కారం అని ఇక్కడి ప్రజలు నినదిస్తున్నారు. జిల్లా కావాలంటూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలకు రాజకీయ మద్దతు లేకపోవడంతో ఆదోని జిల్లా డిమాండ్ కలగానే మిగిలిపోయిందని ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. 2022లో ఉమ్మడి కర్నూలు జిల్లా విభజన జరిగినప్పుడే ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం, రెవెన్యూ శాఖ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చాయి. ఆదోని మండలంలోని పెద్దహరివాణాన్ని మండలంగా ఏర్పాటు చేయనున్నారు.
కర్నూలు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆదోని కేంద్రంగా కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలని, ఆదోని నియోజకవర్గాన్ని నాలుగు మండలాలుగా విభజించి ప్రజలకు పాలన సౌలభ్యం కల్పించాలని ఇక్కడి ప్రజలు ప్రధాన డిమాండ్. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇదే అంశంపై అసెంబ్లీలో గళమెత్తారు. ఆదోని జిల్లా ఏర్పాటు లేనట్లేనని ఉపసంఘం స్పష్టత ఇచ్చింది. కొత్తగా పెద్దహరివాణం మండలం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు.
2022లో జిల్లాల పునర్విభజన..
1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత 1956 అక్టోబరు 31వరకు కర్నూలు రాజధానిగా కొనసాగింది. 1953నుంచి 12అసెంబ్లీ నియోజకవర్గాలు, 53 మండలాలతో అతిపెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో 14 నియోజకవర్గాలుగా విస్తరించింది. 2022లో జిల్లాల పునర్విభజన కారణంగా కర్నూలు, కోడూమూడు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, నియోజ కవర్గాలు పూర్తిగా, పాణ్యం నియోజకవర్గంలోని రెండు మండలాలు కలిపి 26 మండలా లతో ‘కర్నూలు జిల్లా’ మిగిలింది. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలు, పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల మండలాలు కలిపి 27మండలాలతో కొత్తగా నంద్యాల జిల్లా ఆవిర్భవించింది. ఆ సమయంలో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక..
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన సమయంలో ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపించారు. ఆదోని జిల్లా సాధన సమితి పేరిట ఆందోళనలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల కేంద్రంగానే కొత్త జిల్లాలు నాడు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆదోని జిల్లా ఆశలు అడియాశలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలు, డివిజన్లు పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదనలు, వినతులను మంత్రివర్గం స్వీకరించింది. ఆదోని జిల్లా సహా ఆదోని నియోజకవర్గం మొత్తం ఒకే మండలంగా ఉంది. ఆదోని, ఆదోని అర్బన్, పెద్దహరివాణం, పెద్దతుంబళం నాలుగు మండలాలుగా విభజించాలని ఎమ్మెల్యే పార్థసారథి మంత్రివర్గ ఉప సంఘానికి వినతిపత్రం ఇవ్వడంతో పాటుగా అసెంబ్లీలో గళమెత్తారు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలను కలుపుతూ ఆదోని కేంద్రంగా జిల్లా చేయాలనే డిమాండ్‌ను మంత్రివర్గం ఉపసంఘం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తున్నది.
ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో..
ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్యర్యంలో ప్రజా సంఘాలు గురువారం ఆందోళనకు సై అన్నాయి. పెద్దహరివాణంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఆది నారాయణరెడ్డి, మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సంఘాలు తప్ప ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు డిమాండ్ చేయకపోవడంతోనే ఆదోని జిల్లా ఏర్పాటు డిమాండ్ ఎండమావిగా మారిందనే ఆరోపణలు లేకపోలేదు. ఎమ్మెల్యే పార్థసారథి తాజాగా డిల్లీ కేంద్రంగా ఆదోని జిల్లా ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు.
నాలుగు కాదు.. రెండు మండలాలే
ఆదోని నియోజకవర్గంలో 46 రెవెన్యూ గ్రామాలు, 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం 1.15 లక్షల జనాభా ఉంటే, ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా చేరింది. నాలుగు మండలాల ఏర్పాటు ఆవశ్యకతపై పక్కా వివరాలు, అంకెలతో పాటు నివేదికలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనను పట్టించుకోని మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా పెద్దహరివాణం మండలం ఏర్పాటుకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆదోని నియోజకవర్గం ఆదోని, పెద్దహరివాణం రెండు మండలాలు అవుతాయి. ఏ మండలంలో ఏ గ్రామాలు చేరుస్తున్నారో స్పష్టత లేదు. నాలుగు మండలాలు కాకపోయినా ఆదోని, పెద్దహరివాణం, పెద్దతుంబళం మూడు మండలాలుగా విభజించాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.