Share News

హైస్పీడ్‌ ట్రాక్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:20 AM

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల మీదుగా అధునాతనమైన టెక్నాలజీతో హైస్పీడ్‌ రైల్వే లైన్‌ నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి

హైస్పీడ్‌ ట్రాక్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

గంటకు 350 కి.మీ వేగాన్ని తట్టుకునేలా రైలు మార్గాలు

నంద్యాల, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల మీదుగా అధునాతనమైన టెక్నాలజీతో హైస్పీడ్‌ రైల్వే లైన్‌ నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. బుధవారం రైల్‌ ఇండియా అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (రైట్స్‌) అనే సంస్థ ప్రాజెక్టు రూపంలో విడుదల చేసింది. రెండు తెలుగురాష్ట్రాలు మీదుగా 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లే దిశగా రెండు హైస్పీడ్‌ రైలు మార్గాలను నిర్మించునున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదు- బెంగళూరు (605కి.మీ), హైదరాబాదు- చెన్నై (760కి.మీ) దిశగా రూపకల్పన చేశారు.

తెలంగాణ, ఏపీ, కర్ణాటక మీదుగా..

హైదరాబాదు- బెంగుళూరు రైలు మార్గం తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా.. హైదరాబాదు- చెన్నై రైలు మార్గం తెలంగాణ, ఏపీ, తమిళనాడు మీదుగా నిర్మించనున్నారు. ప్రస్తు త రైలు ట్రాక్‌పై 130కి.మీ వేగంతో మాత్రమే వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పున:పరిశీలన చేసి నూతన విధానంలో రైల్వేశాఖ ప్రత్యేక హైస్పీడ్‌ రైలు మార్గాలకు శ్రీకారం చుట్టినట్లైంది.

వివిధ పనులకు అంచనా..

ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా వెళ్లే హైదరాబాదు- బెంగళూరు లైన్‌ 605 కి.మీలకు రూ. 2.38 లక్షల కోట్లు, అదేవిధంగా హైదరాబాదు- చెన్నై లైన్‌ 760 కి.మీలకు రూ. 3.04 లక్షల కోట్లు అంచనా వేశారు. ఈ ప్రకారం.. హైదరాబాదు- బెంగళూరు లైన్‌ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46.56 కి.మీలు, నంద్యాల జిల్లాలో 37.3 కి.మీలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 86.6 కి.మీలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 79.08 కి.మీ మేర నిర్మాణం కానుంది. 988.82 హెక్టార్ల భూమి అవసరం కానుంది. కర్నూలు జిల్లాలో 139.68 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 111.9 హెక్టార్లు కేటాయించాల్సి ఉంది.

రైలు రూట్‌ ఇలా..

హైదరాబాదు- బెంగుళూరు హైస్పీడ్‌ రైలు మార్గం రూపొందిం చిన ప్రకారం.. హైదరాబాదు ఎయిర్‌పోర్ట్‌, భరత్‌ సీటీ, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల జిల్లాలోని డోన్‌, అనంతపురం జిల్లాలోని గుత్తి, అనంతపురం, హిందూపురం, కర్ణాటకలోని అలిపుర, దేవనహళ్లి మీదుగా సదరు లైన్‌ నిర్మించునున్నారు. హైదరా బాదు-చెన్నై లైన్‌ హైదరాబాదు, శంషాబాద్‌, భరత్‌సీటీ, ఏపీలోని డచ్చిపల్లి, నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడురు, తిరుపతి, (ఎయిర్‌పోర్ట్‌) చెన్నై ఐటర్‌రింగ్‌రోడ్‌, చెన్నై స్టేషన్ల మీదుగా ఏర్పాటు చేయనున్నారు. ఇదే క్రమంలో ఏపీలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా వెళ్లనుంది.

ఒక్కొక్క రైల్వేసేషన్‌కు 50 ఎకరాలు..

హైస్పీడ్‌ రైల్వే నిర్మాణాల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారించి త్వరలోనే సదరు పనులకు సంబంధించి అడుగులు వేయనున్నారు. రైలు మార్గాల భూమి అనుకూలమైన అలైన్‌మెంటు గుర్తింపు పక్రియ, ఎక్కడ ఏ స్టేషన్‌ నిర్మించాలి..? అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్క రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి 50 ఎకరాల చొప్పున భూమి సేకరణ చేయడంతో పాటు అవసరమయ్యే మౌళిక సదుపాయా లకోసం సమగ్ర సర్వే, నిర్మాణాల కోసం సమన్వయంలో రైల్వే, ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఏది ఏమైనా సదరు రైలు మార్గం సాకారమైతే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో బుల్లెట్‌ రైళ్ల యోగం పట్టనుంది.

Updated Date - Oct 23 , 2025 | 12:20 AM