అంగన్‌వాడీ చిన్నారులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:27 PM
అంగన్‌వాడీ కేంద్రంలోని ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు అయ్యాయి.
పాములపాడు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రంలోని ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో తల్లిదండ్రులు హుటా హుటిన చికిత్స నిమిత్తం సమీప పట్టణాలలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండలంలోని మిట్టకందాల గ్రామంలోని అంగన్‌వాడీ 3వ కేంద్రంలో బుదవారం 16 మంది చిన్నారులకు గాను 13 మంది హాజరయ్యారు. వీరికి ఉదయం గుడ్డు, మధ్యాహ్నం అన్నం ఆకుకూర పప్పు, సాయంత్రం పాలను టీచర్ అరుణ, ఆయా అందించారు. అయితే రాత్రి ఎనిమిది గంటల సమయంలో చైతన్యకుమార్, అలేఖ్య, సంధ్య, రితిన్, నిక్షిత్‌కుమార్, రిషి, చార్లె్‌సరాజ్, వసుంధర అనే ఐదు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు విరేచనాలు కావడంతో మొదట పాములపాడు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు నలుగురు, ప్రైవేటు ఆసుపత్రికి ముగ్గురు, నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పీడీ లీలావతి, సీడీపీవో మంగవళ్ళి అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి సంఘటనకు గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకొని ఆత్మకూరు చేరుకొని చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను వైద్యలను అడిగి తెలుసుకొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖాశీంవలి, వెంకటరమణ చిన్నారులకు ఇచ్చిన ఆహారం, తాగిన నీరు, వంటకు వాడిన బోరునీటి నమూనాలు సేకరించి టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. వైద్యులు నాగలక్ష్మి, జాకీర్‌బాషా, వైద్య సిబ్బంది చికిత్స పొందుతున్న చిన్నారులను పర్యవేక్షించారు. తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్‌ఐ సురేశ్‌బాబు సంఘటనపై వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న చిన్నారులు కోలుకుంటున్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు తెలిపారు.. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చిన్నారులపై అధికారులు శ్రద్ద తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
‘చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి’
పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీడీపీ నాయకుడుు మాండ్ర సురేంద్రనాద్‌రెడ్డి వైద్యులను కోరారు. గురువారం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి వారి తల్లితండ్రులతో సంఘటనపై ఆరా తీశారు. మార్కెట్‌యార్డ్ చైర్మన్ ప్రసాదరెడ్డి, కన్వీనర్ రవీంద్రరెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, హరినాథరెడ్డి, హరిప్రసాద్, మల్లికార్జునయాదవ్, సురేశ్, లింగస్వామిగౌడ్, అమర్‌నాథ్, కరీంబాషా తదితరులు ఉన్నారు.
ఆహార పదార్థాలు ల్యాబ్‌కు : కలెక్టర్
ఆత్మకూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మిట్టకందాల అంగన్‌వాడీ సెంటర్‌కు సరఫరా అయ్యే అన్ని ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బయలాజికల్ రిపోర్టు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. గురువారం బాధిత చిన్నారులను పరామర్శించేందుకు స్ర్తీసంక్షేమశాఖ కమిషనర్ వేణుగోపాల్‌తో కలిసి ఆత్మకూరులో మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీ-3 సెంటర్‌లో అస్వస్థతకు గురైన చిన్నారులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. మిట్టకందాల గ్రామంలోని అంగన్‌వాడీ-3 సెంటర్‌లో బుధవారం 13 మంది చిన్నారులు హాజరు కాగా వారిలో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారన్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. గ్రామానికి సరఫరా జరిగే అన్ని నీటి పథకాలను పరీక్షించామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, ఐసీడీఎస్ పీడీ లీలావతి, ఆత్మకూరు సీడీపీఓ కోటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లిదండ్రులతో డైరెక్టర్, కలెక్టర్ సమావేశం
పాములపాడు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మిట్టకందాల గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై గురువారం రాత్రి గ్రామానికి ఐసీడీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అంగన్‌వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ అరుణ, ఆయా మంజులను అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు. నిల్వ ఉన్నగుడ్లు, పాల ప్యాకెట్లు, రిజిస్టర్లు పరిశీలించారు. చిన్నారుల వయస్సుకు తగ్గ బరువు ఉన్నారా, పోషకాహార లోపాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. అనంతరం అస్వస్థతకు గురైన చిన్నారుల తల్లితండ్రులతో మాట్లాడారు. అనంతరం ఆవరణలోని టాయ్‌లెట్స్‌ను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, ఆర్డీవో నాగజ్యోతి, సీడీపీవో మంగవల్లి, తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.