అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:36 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హౌసింగ్ కొత్త స్కీమ్ గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి తహసీల్దార్లకు సూచించారు.
నంద్యాల, నూనెపల్లి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హౌసింగ్ కొత్త స్కీమ్ గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి తహసీల్దార్లకు సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం తహసీల్దారులతో పలు రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూరల్ పరిధిలో ఉండే లబ్ధిదారులకు 3 సెంట్లు, అర్బన్ పరిధిలోని లబ్ధిదారులకు 2 సెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. జిల్లాలో భూ సమస్యలపై రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. పట్టా భూములను 22ఏలో చేర్చడానికి వీలు లేదని.. అలా ఎక్కడైనా జరిగినట్లయితే వెంటనే తొలగించాలన్నారు. ఇకనుంచి కార్యాలయపు ఫైళ్లన్నీ సంబంధిత అధికారుల ఈ సైన్‌తో ఈ ఆఫీస్ ద్వారానే తమకు సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలకు వచ్చిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి అర్హులందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. పీజీఆర్‌ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డీఆర్వో రామునాయక్, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.