Share News

సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యం

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:32 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయని, వాటిని బలోపేతం చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకు న్నామని డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి తెలిపారు

సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యం
మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి

డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయని, వాటిని బలోపేతం చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకు న్నామని డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి తెలిపారు. శనివారం కర్నూలు నగరంలోని హోటల్‌-కే ఫర్చూన్‌లో విష్ణువర్దన్‌ రెడ్డి అధ్యక్షతన సంఘాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు రుణ బకాయిల రికవరీపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 99 సంఘాలకు గానూ ఇప్పటి వరకు కేవలం 46 సంఘాల్లో మాత్రమే రుణాలను రికవరీ చేశారని, ఇంకా 53 శాతం రికవరీ చేయాల్సి ఉందని, రూ.550 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని, సాధ్యమైనంత తొందరగా ఈ బకాయిలను రాబట్టాలని సంఘాల సీఈవోలను ఆదేశించారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, డీసీసీబీ సీఈవో రామాంజనేయులు, డీజీఎంలు నాగిరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌ కుమార్‌, ఏజీఎం త్రినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు సువర్ణావకాశం

రైతులపై రుణ భారాన్ని తగ్గించేందుకు బ్యాంకు చరిత్రలో మొదటి సారిగా దీర్ఘకాలిక రుణాలపై వడ్డీని తగ్గిస్తున్నట్లు చైర్మన్‌ విష్ణువర్గన్‌రెడ్డి ప్రకటించారు. 11.10శాతం (93పైసలు) నుంచి 10.35 శాతం (86 పైసలు) తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే సంఘాల ద్వారా రైతులకు ఎరువులను పంపిణీ చేసేందుకు ఒక్కో సంఘానికి రూ.25 లక్షల పూచీకత్తును అందిస్తున్నామన్నారు. రుణ రికవరీ సాధిస్తామని హామీ ఇచ్చిన సంఘాలకు రూ.కోటి రుణ అలాట్మెంట్‌ను ఇవ్వనున్నట్లు చైర్మన్‌ ప్రకటించడంతో సంఘాల అధ్యక్షులు, సీఈవోలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 14 , 2025 | 12:32 AM