Share News

అభ్యాస ఫలితాల్లో మార్పే లక్ష్యం

ABN , Publish Date - May 14 , 2025 | 12:22 AM

: నూతన విద్యావిధానంలో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల అభ్యాస ఫలితాలను మార్చే లక్ష్యంతో రూపొందించిన సమగ్ర నమూనాను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది

అభ్యాస ఫలితాల్లో మార్పే లక్ష్యం

నూతన విద్యావిధానం జీవో విడుదల

డ్రాపౌట్స్‌ నివారించేందుకు కసరత్తు

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యావిధానంలో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల అభ్యాస ఫలితాలను మార్చే లక్ష్యంతో రూపొందించిన సమగ్ర నమూనాను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ పెరగడం, ఉపాధ్యాయులపై పనిభారం అధికం కావడం, తరగతి గదుల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడం తదితర కారణాలతో అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్‌ పాఠశాలల వైపు మొగ్గు చూపడం జరిగిందని ప్రభు త్వం గుర్తించింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేసి రాబోయే విద్యాసంవత్సరంలో ఏర్పాటుచేయనున్న విద్యావ్యవస్థలో మార్పులను ప్రకటించింది, మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 13,192 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి పూనుకుంది. అందులో భాగంగానే మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ, పరిపాలనా బాధ్యతను విద్యాశాఖకు అప్పగించింది.

పాఠశాలల విధానం ఇదీ

శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌(పీపీ1, పీపీ2)

అంగన్‌వాడీకేంద్రాలు శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్‌గా మారి యఽ థావిధిగా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.

పౌండేషన్‌ స్కూల్‌(పీపీ1, పీపీ2, క్లాస్‌1, 2)

సమీప ప్రాధమిక పాఠశాలలకు కిలోమీటర్‌ దూరానికి పైగా ఉన్న అంగన్‌వాడీలను పాఠశాలలో విలీనం చేస్తారు. పీపీ1, 2 విద్యార్థులకు అంగన్‌వాడీ వర్కర్‌లు, క్లాస్‌1, 2 తరగతులకు ఎస్జీటీలు బోధిస్తారు.

బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌(పీపీ1, పీపీ2, క్లాస్‌ 1 నుంచి 5వతరగతి వరకు)

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 59 మంది విద్యార్థులలోపు ఉంటే ఇద్దరు ఎస్జీటీలతో బోధిస్తారు.

మోడల్‌ ప్రైమరీ స్కూల్‌(పీపీ1, పీపీ2, క్లాస్‌ 1 నుంచి 5వ తరగతి వరకు)

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 60 మంది విద్యార్థుల కన్నా ఎక్కువగా ఉంటే నలుగురు ఎస్జీటీలతో బోధిస్తారు.

ఉన్నత ప్రాధమిక పాఠశాల (పీపీ1, పీపీ2, క్లాస్‌ 1 నుంచి 8వ తరగతి వరకు)

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాధమిక పాఠశాల లేదా మోడల్‌ పాఠశాలగా పనిచేస్తుంది. వీరికి ఎస్జీటీల చేత బోధిస్తారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌లు బోధిస్తారు.

హైస్కూల్‌ (6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు)

ఈ పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌లతోనే బోధించడం జరుగుతుంది.

హైస్కూల్‌ (1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు)

ఈ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వరకు ఎస్జీటీలు, 6 నుంచి 10 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. ప్రధానోపాధ్యాయులు టైంటేబుల్‌ ను రూపొందిస్తారు.

హైస్కూల్‌ ప్లస్‌ (6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)

మొత్తం 7 తరగతుల విద్యార్థులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు.

హైస్కూల్‌ ప్లస్‌(1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)

1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఎస్జీటీలు, 6 నుంచి 12వరకు స్కూల్‌అసిస్టెంట్లు బోధిస్తారు. ప్రధానోపాధ్యాయులు అన్ని తరగతులకు టైంటేబుల్‌ను రూపొందిస్తారు.

Updated Date - May 14 , 2025 | 12:22 AM