ఆహా.. ఆక్వా..!
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:39 PM
జీవవైవిధ్యం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ అనే మూడింటితో ముడిపడినదే మత్స్యఉత్పత్తి రంగం. లక్షలాది మంది ఉపాధికి మత్స్య సంపద ఎంతో కీలకం. కాలుష్యం,
జిల్లాలో 37,981 టన్నుల ఉత్పత్తి లక్ష్యం
జీవీఏలో మత్స్య సంపద వాటా రూ.723 కోట్లు
ప్రధానంగా లభించే చేపలు బొచ్చె, రాగండి
నేడు అంతర్జాతీయ మత్స్య దినోత్సవం
జీవవైవిధ్యం, ఆహార భద్రత, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ అనే మూడింటితో ముడిపడినదే మత్స్యఉత్పత్తి రంగం. లక్షలాది మంది ఉపాధికి మత్స్య సంపద ఎంతో కీలకం. కాలుష్యం, పెరుగుతున్న ఎండల ప్రభావంతో చేపల ఉత్పత్తి క్రమేణా తగ్గుతోంది. నంద్యాల జిల్లాలో ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం, వర్షాధార జల వనరులు, చెరువుల వ్యవస్థ, కాలానుగుణ ఉష్ణోగ్రత మార్పులు మొదలైనవి మత్స్య ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల మత్స్యకారులకు బతుకు భారమైపోయింది. ప్రతి యేటా నవంబర్ 21 జరుపుకునే ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల సమస్యలు చర్చనీ యాం శం అవు తాయి. దీన్ని పుర స్కరిం చుకొని ప్రత్యేక కథనం.
కర్నూలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): చేపలు.. జల పుష్పాలగా ప్రసిద్ధి. మనిషికి అవసరమైన విటమిన్లు (బీ2), ఒమేగా-3, కొవ్వు అమ్లాలు, ఇనుము, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు చేపల్లో పుష్కలంగా ఉంటాయి. రాష్ట్రంలో చేపల పెంపకం, మార్కెటింగ్ రంగంలో జిల్లా వాటా అత్యల్పమే. అయినా దేశంలో మత్స్య సందప అభివృద్ధి, ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంస్కరణలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు తోడు కావడంతో ఆ రంగంపై ఆధారపడిన రైతులు ఇప్పుడిప్పుడే ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లాలో సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టు, పులికనుమ, పందికోన, కృష్ణగిరి జలాశయాలు సహా 52 మైనర్ ఇగిరేషన్ చెరువులు చేపల పెంపకం, మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. 29 మత్స్యకారుల సహకార సంఘలు ఉన్నాయి. సుంకేసుల జలాశయం, తుంగభద్ర నదిలో చేపల వేటకు మత్స్యకారులకు లైసెన్సులు ఇస్తారే తప్ప వేలం వేయరు. గాజులదిన్నె జలాశయంలో గాజులదిన్నె మత్స్యకారుల సహకారం సంఘం ఒక్కటే చేపలు పెంపకం, వేటకు అనుమతి ఇస్తారు. పులికనుమ, పందికోన, కృష్ణగిరి జలాశయాలు, ఆయా చెరువుల్లో చేపలు పెంపకం, వేట సాగించేందుకు మత్స్య శాఖ అధికారులు ఏటేటా బహిరంగ వేలాం ద్వారా లీజుదారులకు అప్పగిస్తారు. వేలం ద్వారా ఏటా రూ.25 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా. తుంగభద్ర నది, సుంకేసుల జలాశయంలో చేపల వేటపై వెయ్యి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
రూ.723 కోట్ల లక్ష్యం
చేపలు, రోయ్యలు ఉత్పత్తి, అమ్మకాలు ద్వారా జీవీఏ రూ.723 కోట్లు లక్ష్యం. జిల్లా స్థూల ఉత్పత్తిలో చేపల వాటా కూడా ఎంతో కీలకమే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 37,981 టన్నులు చేపల ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 16,635 టన్నులు, 116 టన్నులు రొయ్యలు ఉత్పత్తి లక్ష్యం కాగా 21 టన్నులు ఉత్పత్తి చేసినట్లు రికార్డులు ద్వారా తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా బొచ్చె, రాగండి చేపలు లభిస్తాయి. నదులు, చెరువుల్లో సహజంగా తిలాపియ (గురక), కొర్రమీను చేపలు పెరుగుతున్నాయి. మార్కెట్లో వీటి ధర తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉన్నప్పటికి జలాశయాలు, చెరువుల్లో పూడిక చేరడం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం చేపల పెంకపంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మత్స్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
70 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యం
సుంకేసుల ఫిష్ సీడ్ ఫారంలో 35 లక్షలు, గాజులదిన్నెలో 20 లక్షలు, కర్నూలు ఫిష్ ఫారంలో 15 లక్షలు చొప్పున 70 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టు కున్నారు. ఆ దిశగా పెంపకం చేస్తున్నారు. గతంలో నీటి వనరుల్లో చేపల పెంపకం కోసం నదుల నుంచి విత్తనాన్ని సేకరించేవారు. దీని వల్ల చేపల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో వచ్చేదికాదు. 1957 జూలై 10న ఒడిశాలోని కటక్ పరిశోధన కేంద్రలో డాక్టర్ కేహెచ్ అలికున్హి, డాక్టర్ హెచ్.హీరాలాల్ చౌదరి అనే శాస్త్రవేత్తలు కార్ప్స్ చేపలలో పునరుత్పత్తిని (హైపో ఫిసేషన్) అనే సాంకేతికతను ప్రవేశ పెట్టి విజయం సాధించారు. ఇది ఆక్వాకల్చర్ విప్లవానికి నాంది పలికింది. ఆనాటి నుంచి చేప పిల్లల ఉత్పత్తి ఎంతో సులభతరంగా మారింది. ఈ ఏడాది జిల్లాలో 70 లక్షలు పిల్లలు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంటే.. పెం పకంలో కొంత నష్టపోక తప్పదు. 82-100 ఎంఎం చేప పిల్లలు ఉత్పత్తి చేసి శ్రీశైలం జలాశయంలో 51.50 లక్షలు, సుంకేసుల జలాశయంలో 3.50 లక్షలు చేప పిల్లలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గాజులదిన్నె సీడ్ ఫారంలో కోటి పిల్లలు పెంపకం
జిల్లాలో తొలిసారిగా గాజులదిన్నె మత్స్యకారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కోటి చేప పిల్లలు పెంపకానికి శ్రీకారం చుట్టారు. తుంగభద్ర డ్యాం నుంచి కోటి చేప పిల్లల ఉత్పత్తి గుడ్లు తెచ్చి మత్స్య శాఖకు చెందిన ఫిష్ సీడ్ ఫారంలో ఆ శాఖ అధికారుల సలహా మేరకు పెంపకం చేపట్టారు. చివరికి 25 లక్షల చేప పిల్లలు మిగులుతాయి. వీటి విలువ దాదాపుగా రూ.40 లక్షలు ఉంటుందని అంచనా. వాటిని జీడీపీ జలాశయంలో వదులుతారు. కోటి గుడ్డు కొనుగోలుకు రూ.1.50 లక్షలు, పెంపకం కోసం మరో రూ.10-15 లక్షలు ఖర్చు చేశారు. అలాగే.. గూడూరు మత్స్యకారుల సహకార సంఘం ఆధ్వర్యంలో కూడా 60 లక్షలు చేప పిల్లలు పెంపకానికి చర్యలు చేపట్టారు.
కనీస సౌకర్యాలు మృగ్యం
కర్నూలు జిల్లాలోని గాజులదిన్నె, పందికోన, కృష్ణగిరి, పులికనుమ జలాశయాల్లో చేపల పట్టేందుకు లీజు దారులు మత్స్యకారులను ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచే కా కుండా తమిళనాడు నుంచి తీసుకొస్తున్నారు. జలశయాల ఒ డ్డునే చిన్నపాటి గుడారాలు వేసుకొని వేట సాగిస్తున్నారు. అయితే.. కనీస సౌకర్యాలు ఉండడం లేదు. వారికి లైసెన్సు కూడా ఉండదు. దీంతో ప్రమాదాలకు గురైతే మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సంబంధిత శాఖ అధి కారులు ఇతర ప్రాంతాల నుంచి చేపలు పట్టేందుకు వచ్చే మత్స్యకారులకు స్థానికంగా లైసెన్సులు ఇవ్వడంతో పా టు వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మత్స్య సంపద దేశార్థిక ప్రగతికి వెన్నుదన్ను
రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో చేపల పెంపకం అతితక్కువగా ఉంది. ప్రధాన కారణం జల వనరులు లేకపోవడమే. జిల్లాలో ఈ ఏడాది 37,981 టన్నులు చేపలు, 116 టన్నులు రొయ్యలు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 16,635 టన్నులు చేప లు, 21 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేశాం. జిల్లా జీవీఏ లక్ష్యం రూ.723 కోట్లు. మత్స్య శాఖ ఫిష్ సీడ్ ఫారాల్లో 70 లక్షల చేప పిల్లలు పెంపకం చేపట్టాం. వివిధ కారణాలు వల్ల పెంపకం దశలోనే కొంత కోల్పోవాల్సి వస్తుంది. శ్రీశైలం జలాశయంలో 51.50 లక్షలు, సుంకేసుల జలాశయంలో 3.50 లక్షల చేప పిల్లలు వదిలేందుకు సన్నహాలు చేస్తున్నాం. మన చెరువు - మన సీడ్ పథకం కింద గాజులదిన్నె సొసైటీ కోటీ, గూడూరు సొసైటీ 60 లక్షలు, సుంకేసుల సోసైటీ ఆధ్వర్యంలో 50 లక్షల చేప గుడ్డు పిల్లలు తెచ్చి పెంచుతున్నాం. నేడు అంతర్జాతీయ మత్స్య దినోత్సవం పురస్కరించుకొని గాజులదిన్నె జలాశయంలో చేప పిల్లలు వదులుతాం. తగిన జాగ్రత్తలతో చేపల పెంపకం చేపడితే లాభదాయంగా ఉంటుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
- రంగనాథ్ బాబు, డీడీ, మత్స్య శాఖ, కర్నూలు