Share News

పీపీపీ విధానంలో ఆదోని వైద్య కళాశాల నిర్వహణ

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:15 AM

రాష్ట్రంలో వివిధ దశల్లో ఆగిపోయిన వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ - పీపీపీ) విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పీపీపీ విధానంలో ఆదోని వైద్య కళాశాల నిర్వహణ
అసంపూర్తిగా ఆదోని మెడికల్‌ కాలేజీ వివిధ విభాగాల భవనాలు

ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రివర్గం ఆమోదం

వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు అవకాశం

కర్నూలు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ దశల్లో ఆగిపోయిన వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ - పీపీపీ) విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పది కాలేజీలను ఈ విధానం కిందకు తీసుకురాగా అందులో ఆదోని వైద్య కళాశాల ఒకటి. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీలో తొలి దశలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందులు మెడికల్‌ కాలేజీల అభివృద్ధి, ఆర్‌ఎ్‌ఫపీ ముసాయిదా, రాయితీ ఒప్పందాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదోని మెడికల్‌ కాలేజీ పనులు త్వరలోనే పునఃప్రారంభం అయ్యే అకాశం ఉంది. అదే జరిగితే 2026-27 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్యార్థుల ప్రవేశాలకు అవకాశాలు ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్‌ కళాశాలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అందు లో ఆదోని మెడికల్‌ కాలేజీ ఒకటి. 420 పడకల సామర్థ్యం గల బోధనాస్పత్రి ఇది. 2024-25 విద్యా సంవత్సరంలో వైద్యవిద్యా తరగతులు ప్రారంభిస్తామంటూ ఆర్భాటం చేశారు. నాబార్డు రుణం రూ.475 కోట్లతో నిర్మాణాలు మొదలు పెట్టారు. 13.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్‌ హాస్పెటల్‌, మెడికల్‌ కాలేజీ, రెసిడెన్సియల్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌, నర్సింగ్‌ కాలేజీ, విద్యార్థుల వసతి గృహాలు, జూనియర్‌, సీనియర్‌ రెసిడెన్స్‌ హాస్టల్‌, నర్సింగ్‌ విద్యార్థుల వసతి గృహం తదితర పనులను రూ.350 కోట్లతో చేపట్టారు. ఆంధ్రప్రవేశ్‌ మెడికల్‌ సర్వీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎ్‌సఐడీసీ) పర్యవేక్షణలో విజయవాడకు చెందిన కాంట్రాక్ట్‌ సంస్థ కేఎంవీ గ్రూప్‌ సంస్థ పనులు మొదలు పెట్టింది. నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆదోని వైద్య కళాశాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

మంత్రివర్గం ఆమోదంతో చిగురించిన ఆశలు

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మెడికల్‌ కాలేజీలు నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌ (యూపీ), గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించి ఎలా నిర్వహిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయించినట్లు తెలుస్తుంది. కళాశాలను ప్రారంభించాక ఓపీ, ఐపీ అంచనాలు, రోగ నిర్ధారణ పరీక్షల యంత్రాలు, పరికరాల కొనుగోళ్లకు అయ్యే వ్యయం, వైద్యసీట్లు ద్వారా వచ్చే ఆదాయం, వైద్యుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు.. ఇలా సమగ్ర వివరాలతో ఇచ్చిన అధారంగా పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ నిర్వహించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండర్లు నిర్వహించి కళాశాల నిర్వహణ సంస్థను ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే ఆదోని వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

కరువు పల్లెల్లో పవన విద్యుత్‌ ప్రాజెక్టు

పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆస్పరి మండలాల్లో 300 మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024లో భాగంగా మెస్సర్స్‌ సెరెంటికా రెన్యూవబుల్స్‌ ఇండియా సంస్థకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Sep 05 , 2025 | 12:15 AM