ఆదోని జిల్లా ఏర్పాటు చేయాల్సిందే
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:13 PM
ఆదోని జిల్లా సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
500 మందితో మాజీ ఎంపీ బుట్టా రేణుక మద్దతు
ఎమ్మిగనూరులో మానవహారం
కర్నూలు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లా సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. మం గళవారం ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆటో కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, రైతులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు కలసి జిల్లా సాధన కోసం ఉద్య మించారు. ఆదోని జిల్లా సాధన సమితి, జేఏసీ ఆధ్వరంలో భీమాస్ కూడలి లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహం ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారం నాటికి 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక దాదాపు 500 మందికి పైగా అనుచరులతో ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి చేరుకుని మద్దతు పలికారు. ఆమె వెంట ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఉన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లా ఇవ్వకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆదోని జిల్లా చేస్తామని ప్రకటించారు. సీనియర్ నాయకుడు పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి కన్వీనర్‌గా జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ జేఏసీలో న్యాయవాది లలితాజితేంద్ర, రిటైర్డ్ ఉపాధ్యాయులు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడ్, నాయకులు నూర్ అహ్మద్, కోదండ, దస్తగిరి నాయుడు, కుంకూరు వీరేశ్‌లు సభ్యులుగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆదోని జిల్లా కోసం చేస్తున్న ఉద్యమాలు జోరందుకోవడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి నేడు అమరావతిలో సీఎం చంద్రబాబును కలవనున్నారు. కాగా జిల్లా సాధన కోసం ఏపీ ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూల్స్ మ్యానేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వరంలో శనివారం నాలుగువేల మందితో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.