Share News

తారస్థాయికి‘ఆదోని జిల్లా’ ఉద్యమం..!

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:09 AM

పశ్చిమ ప్రాంత ప్రజలు ఆదోని జిల్లా సెంటిమెంట్‌ను బలంగా వినిపిస్తున్నారు. జిల్లా సాధన కోసం ఉద్యమ జోరు పెంచారు. తమ పిల్లల భవిష్యత్తు.. కరువు పల్లెసీమలు అభివృద్ధికి ప్రత్యేక జిల్లానే ఇంధనమని ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు.

తారస్థాయికి‘ఆదోని జిల్లా’ ఉద్యమం..!
విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

రోడ్డెక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

మద్దతు పలికిన వ్యాపారులు

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు

కర్నూలు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంత ప్రజలు ఆదోని జిల్లా సెంటిమెంట్‌ను బలంగా వినిపిస్తున్నారు. జిల్లా సాధన కోసం ఉద్యమ జోరు పెంచారు. తమ పిల్లల భవిష్యత్తు.. కరువు పల్లెసీమలు అభివృద్ధికి ప్రత్యేక జిల్లానే ఇంధనమని ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. సోమవారం ఆదోని జిలా సాధన లక్ష్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు రోడ్డెక్కారు. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, వినూత్న నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగాయి. ఆదోని జిల్లా సాధిస్తాం.. అనే నినాదాలతో పురవీధులు దద్దరిల్లాయి. మరోవైపు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు ఉద్యమ సెగ తాకింది. ఆదోని జిల్లా, పెద్దతుంబళం కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలంటూ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి ఇంటిని ముట్టడించారు.

నాయకుల నిర్లక్ష్యం..

ఆదోని జిల్లా డిమాండ్‌ ఈనాటిది కాదు. 1952లో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు సమయంలోనే బీజం పడింది. ఓల్డ్‌ ఆదోని డివిజన్‌ నియోజకవర్గాలు కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని పశ్చిమ ప్రాంత ప్రజల 73 ఏళ్ల సెంటిమెంట్‌ ఇది. 1968-68లో ప్రకాశం జిల్లా ఏర్పాటు సమయంలో అనంతపురం జిల్లా గుంతకల్లు, ఆదోని డివిజన్లను కలుపుతూ ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌ను నాటి రాజకీయ నేతలు తొక్కిపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో 13 జిల్లాను విభజించి 26 జిల్లాలు చేసింది. అప్పట్లో ఆదోని జిల్లా కోసం అప్పటి ఎమ్మెల్యేలు ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదు. సరిగ్గా వైసీపీ నేతల పంథాలోనే కూటమి నేతలు సైతం మౌనం వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. జిల్లా సాధన కోసం ప్రజా సంఘాలు రోడ్డెక్కినా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సీఎం చంద్రబాబు వద్ద గట్టిగా వాదన వినిపించడంలో విఫలమయ్యారు. ‘ఆదోని జిల్లా తెస్తాం.. ప్రాణాలైనా అర్పిస్తాం..’ అంటూ నాలుగు సినిమా డైలాగ్‌లు చెప్పిన నేతలు ఇప్పుడు మిన్నుకుండిపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అలసత్వం, నిర్లక్ష్యమే ఆదోనికి జిల్లా హోదా దక్కలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాలన సౌలభ్యం

ప్రస్తుతం పశ్చిమ ప్రాంతం గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రం కర్నూలుకు రావాలంటే 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులో వచ్చి పనులు చేసుకొని వెళ్లాలంటే ఒక రోజు సరిపోదు. దీంతో వ్యయప్రయాసాలు తప్పడం లేదు. అంతే కాదు వివిధ శాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణ నామమా త్రంగా ఉంది. అదే ఆదోని జిల్లా చేస్తే చట్టూ ఉన్న నాలుగు నియోజ కవర్గాల కేంద్రాలకు 26-48 కిలోమీటర్లలోపే. అదే శివారు గ్రామాల నుంచి కూడా 45-50 కిలో మీటర్లకు మించదు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ ఎంతో సులభతరమై ప్రజలకు మెరుగైన పాలన, సౌకర్యాలు అందుతాయి. పశ్చిమ కరువు ప్రాంతం ప్రత్యేక జిల్లా అయితే ప్రగతి పరుగులు పెట్టే అవకాశం లేకపోలేదు.

నియోజకవర్గ కేంద్రాల నుంచి కర్నూలు,

ఆదోనికి ఉన్న దూరం కిలోమీటర్లలో..

నియోజకవర్గ కేంద్రం కర్నూలు ఆదోని

ఆదోని 102 --

ఆలూరు 125 26

ఎమ్మిగనూరు 73 28

మంత్రాలయం 95 48

పత్తికొండ 85 38

జోరందుకున్న ఉద్యమం..

గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఆదోని జిల్లా పేరు లేదని తెలిసి రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా గొంతెత్తు తున్నారు. ప్రజల్లో సెంటిమెంట్‌ బలపడి జిల్లా సాధన పోరాటం వేగం పుంజుకుంది. సోమవారం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు విట్టా సతీశ్‌, ఆదోని షరాఫ్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దీపక్‌, ఆదోని అగ్రి ఇన్పుట్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోకానందారెడ్డి, స్థానిక అధ్యక్షుడు ఎర్రిస్వామి, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నాయకులు, ఆదినారాయణరెడ్డి, లలితా జితేంద్ర, నూర్‌ అహ్మద్‌, రాఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్‌, కోదండ, రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు విట్టా రమేశ్‌, చంద్రకాంత్‌రెడ్డి, దేవిశెట్టి ప్రకాశ్‌, వీరేశ్‌, తిరుమలేశ్‌, దస్తగిరి తదితరుల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అదే క్రమంలో ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని, పెద్దతుంబళం కేంద్రంగా మరో మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పెద్దహరివాణం మండలంలోకి తమ గ్రామాలను చేర్చకూడదంటూ పలు గ్రామాల ప్రజలు సబ్‌ కలెక్టర్‌ కార్యలయం వద్ద ఆందోళన చేశారు. కలెక్టరేట్‌లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చి కలెక్టర్‌ సిరికి వినతి పత్రం అందజేశారు.

సీఎం చంద్రబాబును ఒప్పించగలరా?

గతంలో కర్నూలు నగరానికి సమీపంలో ఉన్న డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాలను నంద్యాల జిల్లాలో కలిపారు. మమ్ములను కర్నూలు జిల్లాలోనే ఉంచాలని ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు ఇప్పటికీ కోరుతున్నారు. డోన్‌ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లా చేర్చాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. నంద్యాల జిల్లా నుంచి ఆ రెండు నియోజకవర్గాలు విడదీసి కర్నూలు, కోడుమూరు, డోన్‌, నందికొట్కూరు, పాణ్యం (రెండు మండలాలు) నియోజకవర్గాలను కలుపుతూ కర్నూలు జిల్లా, ఓల్డ్‌ రెవిన్యూ డివిజన్‌ అయినా ఆదోని కేంద్రంగా ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలుపుతూ ఆదోని జిల్లా చేస్తే పాలన పరంగా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. దీనిపై సీఎం చంద్రబాబును ఒప్పిస్తేనే సాధ్యం అవుతుంది. అది సాకారం కావాలంటే రాజకీయాలు, వర్గవిభేదాలు కాస్త పక్కన పెట్టి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగాలి. ఎమ్మెల్యేలు డాక్టర్‌ పార్థసారథి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, టీడీపీ ఇన్‌చార్జిలు మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, ఎన్‌.రాఘవేంద్రరెడ్డి, వైకుంఠం జ్యోతి సహా వైసీపీ ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, బి.విరూపాక్షి సహా ఆయా పార్టీల ముఖ్య నాయకులు జట్టుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సహా మంత్రివర్గ ఉప సంఘాన్ని కలసి ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే జిల్లా స్వప్నం సాకారం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - Dec 02 , 2025 | 01:09 AM