ఆదోని జిల్లా.. ప్రజల ఆకాంక్ష.!
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:14 AM
‘ఆదోని జిల్లా అనేది.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో ఆదోని ప్రస్థావన లేకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి
సీఎం చంద్రబాబుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి విన్నపం
కర్నూలు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆదోని జిల్లా అనేది.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో ఆదోని ప్రస్థావన లేకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్పతో కలసి గురువారం రాత్రి ఆయన ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఆదోని జిల్లా సాకారం చేయడంతో పాటు అసంబద్ధంగా జరిగిన ఆదోని మండల విభజనను సరి చేయాలని తిక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదోని జిల్లా కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులతో పాటు ప్రతిపక్ష వైసీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ముందు ఆదోని జిల్లా చేస్తామని హామీ ఇచ్చామా? అని సీఎం చంద్రబాబు అడిగారని, ఆ సమయంలో ఆదోని జిల్లా డిమాండ్ లేకపోవడంతో హామీ ఇవ్వలేదని తిక్కారెడ్డి వివరించారు. ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమయంలో జిల్లా పార్టీ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి టీజీ భరత్, టీడీపీ జోన్-5 ఇన్‌చార్జి బీదా రవిచంద్ర, ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు, ముఖ్యనాయకులు చర్చించి జిల్లా ఏర్పాటుపై సాధ్యసాధ్యాలు, రాజకీయ అంశాలపై సమగ్ర నివేదిక తెప్పించుకుంటానని సీఎం చెప్పారని తిక్కారెడ్డి తెలిపారు. అదేవిధంగా జిల్లాలో టీడీపీ తాజా పరిస్థితిపై అధినేత చంద్రబాబుకు నివేదిక అందజేసినట్లు పేర్కొన్నారు.