డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:46 PM
డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
మంత్రి టీజీ భరత్
ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీ
కర్నూలు క్రైం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆదివారం ఈగల్ ఆధ్వర్యంలో కర్నూలులో డ్రగ్స్ వద్దు బ్రో - సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రి టీజీ భరత్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఈగల్ ఎస్పీ నాగేష్‌బాబు హాజరయ్యారు. ఈ ర్యాలీ కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమై ఎస్వీ కాంప్లెక్స్ మీదుగా జిల్లా పోలీసు కార్యాలయం వరకు సాగింది. సుమారు 400 మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలులో డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉండటం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జాతీయ సంపదకు నష్టం వాటిల్లుతుందని, యువత భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. ఈగల్ ఎస్పీ నాగేష్ బాబు మాట్లడుతూ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో పోలీసు శాఖతో ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుశేన్‌పీరా, కృష్ణమోహన్, రెడ్ క్రాస్ జిల్లా ఇన్‌చార్జి గోవిందరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.