తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:48 PM
పత్తి కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ సిరి హెచ్చ రించారు.
ఇప్పటి దాకా 12 కేసులు నమోదు
రూ.90వేలు జరిమానా విధించాం
కలెక్టర్ సిరి
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ సిరి హెచ్చ రించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదు వచ్చాయన్నారు. ఈనెల 18 నుంచి 22 వరకు లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో గూడూరు, కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, ఆదోని, కోసిగి మండలాల్లో ఉన్న పత్తి కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు వేబ్రిడ్జీలు, జిన్నింగ్ ప్రెష్ యూనిట్లలో అకస్మిక తనిఖీలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. కొందరు వ్యాపారులు ఉపయోగిస్తున్న తూకపు యంత్రాలు, రీవెరిఫికేషన్, స్టాంపింగ్ గడువు దాటినవని గుర్తించి లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం 12 కేసులు నమోదు చేశామన్నారు. వారి నుంచి రూ.90వేలు జరిమానాలు విధించినట్లు తెలిపారు. గ్రామా ల్లోనే రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై ఆయా మార్కెట్ కమిటీల సెక్రటరీలు, మార్కె టింగ్ శాఖ అధికారులు నిఘా ఉంచి వారిని నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు.