Share News

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , Publish Date - May 24 , 2025 | 12:26 AM

పోలీసు అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
పాల్గొన్న పోలీసు అధికారులు, ఇన్‌సెట్‌లో మాట్లాడుతున్న ఎస్పీ

కేసుల దర్యాప్తుపై డీఎస్పీలు దృష్టిసారించాలి

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, మే 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్‌ డివిజన్‌లో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్‌ కేసులపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తులపై డీఎస్పీలు దృష్టి సారించాలన్నారు. నేరాల నివారణే ప్రథమ కర్తవ్యంగా పనిచే యాలన్నారు. డాబాల్లో మద్యం, ఓపెన్‌ డ్రింకింగ్‌, పేకాట వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగి దాడులు చేస్తాయన్నారు. పెండింగ్‌ కేసులు తగ్గించాలన్నారు. మెజిస్ర్టేట్‌లను కలిసి పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పెండింగ్‌ కేసుల్లో నిందితుల అరెస్టు గురించి ఆరాతీసి శిక్షలు పడేలా చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల దర్యాప్తుల పై డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా హైవే పెట్రోలింగ్‌ పోలీసులు బాగా పని చేయాలన్నారు. పోలీసు అధికారులు గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదాల మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రేడియం స్టిక్కర్లు, బారికేడ్లు, బ్లింకర్స్‌, స్పీడ్‌ బ్రేకర్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లు, మిస్సింగ్‌ కేసులను ఛేదించాలన్నారు. అనంతరం గత నెలలో వివిద కేసులలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. డీఎస్పీలు బాబు ప్రసాద్‌, ఉపేంద్రబాబు, హేమలత, ఏఆర్‌డీ ఎస్‌పీ బాస్కర్‌రావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:27 AM