వైద్య, డ్రగ్ కంట్రోల్ అధికారులపై చర్యలు
ABN , Publish Date - May 08 , 2025 | 12:48 AM
జిల్లాలోని కర్నూలు, ఆదోనిలో నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న ఆస్పత్రులపై 2017 జూన్‌లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అభియోగాలు రుజువు కావడంతో ఆ సమయంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, ఇద్దరు డ్రగ్ కంట్రోల్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంంది.
మూడు వార్షిక ఇంక్రిమెంట్ల నిలిపివేత
2017లో కర్నూలు, ఆదోనిలోని నకిలీ వైద్యుల ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు
డెకాయ్ ఆపరేషన్‌లో వెలుగులోకి వాస్తవాలు
ఎనిమిదేళ్ల అనంతరం క్రమశిక్షణ చర్యలు
కర్నూలు, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కర్నూలు, ఆదోనిలో నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న ఆస్పత్రులపై 2017 జూన్‌లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అభియోగాలు రుజువు కావడంతో ఆ సమయంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, ఇద్దరు డ్రగ్ కంట్రోల్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంంది. వీరికి మూడు వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్స్ నిలిపివేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ వైద్యులు నిర్వహిస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు అప్పల్లో కలకలం సృష్టించాయి.
కర్నూలు నగరంలో ఇలా..
నగరంలోని బళ్లారి చౌరస్తా సమీపంలోని చల్లావారి వీధిలో జేఆర్ చిల్డ్రన్ అండ్ సూపర్ హాస్పెటల్ స్థాపించి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ఆదోని పట్టణంలో విజయగౌరి సూపర్ స్పెషాలిటీ హాస్పెటల్ స్థాపించారు. ఈ రెండు ఆస్పత్రుల్లో అర్హత లేని వ్యక్తులు నకిలీ వైద్యులుగా అవతారమెత్తి రోగులకు చికిత్స అందిస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు పక్కాగా సమాచారం వచ్చింది. దీంతో 2017 జూన్ 20న విజిలెన్స్ అధికారులు పక్కా ప్రణాళికతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా ఆసుపత్రికి రోగులుగా ఆస్పత్రికి వెళ్లి, పరిశీలించారు. పదో తరగతి కూడా చదవని వ్యక్తులు తమ పేర్ల ముందు డాక్టర్, చివరల్లో ఎండీ అని రాసుకున్నారని గుర్తించారు. ఆ వెంటనే మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అప్పటి విజిలెన్స్ ఎస్పీ శివకోటి బాబురావు, సీఐ జగన్మోహన్‌రెడ్డి, ఏవో వెంకటేశ్వర్లు తదితర విజిలెన్స్ అధికారులు కీలకంగా పని చేశారు.
ఆస్పతి నిర్వహకులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వానికి పక్కా ఆధారాలతో నివేదిక ఇచ్చారు. అలాగే. ప్రైవేటు ఆసుపత్రి స్థాపించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పని సరి. ఇందుకు వైద్యులు బృందం, డ్రగ్స్ అధికారులు తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఉన్నాయని నివేదిక ఇవ్వాలి. అయితే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.రంగనాథ్ ఆధ్వర్యంలోని బృందం ఆ ఆస్పత్రులను తనిఖీ చేసి నివేదిక ఇచ్చారు. అదే క్రమంలో కర్నూలు జిల్లా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్, ఆదోనికి చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేఎస్ దాదా ఖలందర్‌లు కూడా ఆరోపణుల ఎదుర్కొంటున్న ఈ ఆస్పత్రులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినట్లు తేలింది. దీంతో ఈ ముగ్గురితో పాటు 18 మందిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలలో ఏమ్రాతం నిజం లేదని, న్యాయం చేయాలని కోరుతూ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.రంగనాథ్, డ్రగ్ కంట్రోల్ కర్నూలు ఏడీ ఎం.చంద్రశేఖర్, ఆదోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేఎస్ దాదా ఖలంద్‌లు వేరువేరుగా విన్నంచారు. వీరి విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇందుకు కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ చేయించింది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వీరిపై మోపిన అభియోగాలు నిజమేనని విచారణ కమిషన్ తేల్చింది. అక్రమాలు రుజువు కావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పై ముగ్గురు అధికారులపై మూడు వార్షిక ఇంక్రిమంట్లు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆర్యోగం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి మంజుల డి హోస్మని వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.