Share News

నాణ్యమైన ఉల్లికి ధర తగ్గిస్తే చర్యలు : కలెక్టర్‌

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:10 AM

రైతులు తెచ్చిన నాణ్యమైన ఉల్లికి కూడా తక్కువ ధరను అందిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ రంజిత్‌ బాషా వ్యాపారులను హెచ్చరించారు.

నాణ్యమైన ఉల్లికి ధర తగ్గిస్తే చర్యలు : కలెక్టర్‌
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రైతులు తెచ్చిన నాణ్యమైన ఉల్లికి కూడా తక్కువ ధరను అందిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ రంజిత్‌ బాషా వ్యాపారులను హెచ్చరించారు. కర్నూలు మార్కెట్‌ యార్డును కలెక్టర్‌ రంజిత్‌ బాషా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పూర్తిగా పక్వానికి వచ్చిన ఉల్లిని మార్కెట్‌ యార్డుకు తీసుకురావాలని సూచించారు. ముందస్తు వర్షాలకు చేతికందిన ఉల్లిని మాత్రమే అమ్మకానికి రైతులు తీసుకువస్తే మంచి ధర లభిస్తుందని, ప్రభుత్వం ముందస్తుగా మద్దతు ధర ఇస్తుందనే ఆశతో పక్వానికి రాని ఉల్లిని కూడా అమ్మకానికి తీసుకురావద్దని సూచించారు. ఉల్లి రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ జిల్లా అధికారి రామాంజ నేయులును ఆదేశించారు. కర్నూలు మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేసిన ఉల్లిని ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని రైతుబజార్లకు ఇతర విభాగాలకు తరలించాలని మార్క్‌ఫెడ్‌ అధికారి రాజుకు సూచించారు. అనంతరం వ్యాపారులు, వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రైతులకు క్వింటానికి రూ.1200 గిట్టుబాటు ధర అందిస్తుందన్న ఉద్దేశంతో రైతులతో తక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేయడం సరికాదని, తనిఖీలు చేయించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు మార్కెట్‌ కమిటీ అధికారులు కొనుగోళ్లను దగ్గరుండి పరిశీలించాలన్నారు. లైసెన్సు కలిగిన వ్యాపారులందరూ తప్పనిసరిగా ఉల్లి కొనుగోళ్లలో పాల్గొనేలా చూడాలని మార్కెట్‌ కమిటీ సెక్రటరీ జయలక్ష్మిని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్య, ఉద్యానశాఖ జిల్లా అధికారి రామాంజనేయులు, మార్కెటింగ్‌శాఖ జేడీ రామాంజ నేయులు, ఏడీఎం నారాయణమూర్తి, కమిటీ చైర్‌పర్సన్‌ అజ్మద్‌బీ, వైస్‌ చైర్మన్‌ శేషగిరి శెట్టి తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:10 AM