మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే చర్యలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:26 AM
నిషేధిత గంజాయి తదితర మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హుశేన్ పీరా తెలిపారు.
అడిషనల్ ఎస్పీ హుశేన్‌పీరా
కర్నూలు, డోన్ రైల్వేస్టేషన్లలో అకస్మిక తనిఖీలు
కర్నూలు క్రైం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నిషేధిత గంజాయి తదితర మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హుశేన్ పీరా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణ నివారించడానికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ రైల్వేస్టేషన్‌లలో, రైళ్లలో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక పోలీసులు, ఈగల్ టీమ్, స్పెషల్ పార్టీ పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు, రైల్వే ఆర్‌పీఎస్, జీఆర్‌పీ పోలీసులు సంయుక్తంగా రైల్వేస్టేషన్‌లలో, రైళ్లలో తనిఖీలు చేశారు. కర్ణాటక నుంచి ఉత్తరాఖండ్ రాష్ర్టానికి కర్నూలు మీదుగా వెళ్లే యశ్వంత్‌పూర్ నుంచి రిషికేశ్ వెళ్లే రైలులో జనరల్ బోగి, ఏసీ బోగీలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో డీఎస్పీ బాబు ప్రసాద్, టూటౌన్ సీఐ నాగరాజరావు, అబ్దుల్ గౌస్, గుణశేఖర్‌బాబు, ఎస్‌ఐ సతీష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
డోన్ టౌన్: గంజాయి వంటి మత్తు పదార్థాలు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా హెచ్చరించారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలన కోసం రైల్వేస్టేషన్‌లలో తనిఖీల్లో భాగంగా గురువారం పట్టణంలోని రైల్వేస్టేషన్‌లలో ఒరిస్సా నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైలు.నెం.22831ను ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా ఆధ్వర్యంలో ఈగల్ టీమ్, పట్టణ పోలీసులు, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు తనిఖీ చేశారు. సీఐ ఇంతియాజ్ బాషాతో పాటు ఆర్‌పీఎఫ్, డోన్ ఐపీఎఫ్ నాగభూషణం, గంగయ్య యాదవ్, తాలుకా యూపీఎస్ సిబ్బంది, జీఆర్‌పీ టీమ్, ఎస్‌ఐ కుమారి, బిందుమాధవి ఇందులో ఉన్నారు.