Share News

దాడి కేసులో నిందితుల అరెస్టు

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:50 AM

మండల పరిధిలోని కంపమల్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సోమల లోకేశ్వర్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కె.ప్రమోద్‌ తెలిపారు

దాడి కేసులో నిందితుల అరెస్టు
నిందితులను చూపుతున్న డీఎస్పీ, సీఐ, పోలీసులు

కోవెలకుంట్ల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కంపమల్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సోమల లోకేశ్వర్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కె.ప్రమోద్‌ తెలిపారు. శనివారం కోవెలకుంట్ల సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమోద్‌ మాట్లాడుతూ వైసీపీకి చెందిన సోమల లోకేశ్వర్‌రెడ్డి, టీడీపీకి చెందిన సూర చిన్నసుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. 2019 నుంచి 2024 వరకు రెండున్నర సంవత్సరాలు లోకేశ్‌రెడ్డి సర్పంచ్‌గా పని చేశాడని తెలిపారు. ఇటీవల టీడీపీకి చెందిన చిన్నసుబ్బారెడ్డి వర్గీయులను రెచ్చగొట్టే విధంగా లోకేశ్‌రెడ్డి అనుచరులు మాట్లాడారని, దీంతో సుబ్బారెడ్డి వర్గీయులు ఇనుపరాడ్లను తీసుకుని సోమల లోకేశ్‌ ఇంటిపై దాడి చేశారని అన్నారు. ముందుగా వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిని కొట్టి గాయపరిచారని తెలిపారు. తరువాత వెంకటేశ్వర్‌రెడ్డి ఇంట్లో ఉండగా ఇంట్లో రెండు డోర్లను పగలగొట్టి వెంకటేశ్వర్లుపై దాడి చేసి గాయపరిచారని, అంతలో లోకేశ్‌రెడ్డి పొలం నుంచి ఇంటికి రాగా అతనిపైనా దాడి చేసి గాయపర్చారని అన్నారు. లోకేశ్‌రెడ్డి స్పృహ తప్పగా అతని తమ్ముడు వెంకటేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అందులో సూరచిన్నసుబ్బారెడ్డి, పోమల లక్ష్మీనారాయణరెడ్డి, సూర సురే్‌షకుమార్‌రెడ్డి, సూర రవికుమారరెడ్డి, షేక్‌ సుభాన్‌, రావిడ్డిగారి వెంకటసుబ్బారెడ్డిలను శనివారం ఆళ్లగడ్డ రోడ్డులోని కంపమల్ల మెట్ట వద్ద కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేసి రిమాండుకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సీఐ హనుమంతనాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:50 AM