Share News

ప్రీ-టెస్ట్‌లో ఖచ్చితత్వం తప్పనిసరి

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:39 PM

మహానంది మండలంలో పైలట్‌ ప్రాతిపదికన జరగనున్న జనాభా లెక్కల ప్రీ-టెస్ట్‌ కార్యకలాపాల్లో ఖచ్చితత్వం పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

ప్రీ-టెస్ట్‌లో ఖచ్చితత్వం తప్పనిసరి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

జనాభా లెక్కల ముందుస్తు కార్యక్రమంలో కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : మహానంది మండలంలో పైలట్‌ ప్రాతిపదికన జరగనున్న జనాభా లెక్కల ప్రీ-టెస్ట్‌ కార్యకలాపాల్లో ఖచ్చితత్వం పాటించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో 2027 జనాభా లెక్కల ముందస్తు సెన్సిటైజేషన్‌ కార్యక్రమాలపై జిల్లా స్థాయి శిక్షణా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 2027 జనాభా లెక్కల ప్రీ టెస్ట్‌ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యమైనవని, సెన్సస్‌ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు సంపూర్ణ శిక్షణ పొంది ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ పనిని సమయపాలనతో నిర్దిష్ట విధానంలో పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల 10 నుంచి 30 వరకు మొదటి దశగా ఇళ్ల జాబితా, ప్రాథమిక సర్వే నిర్వహించనున్నట్లు తెలియజేసి ఈ దశకు అవసరమైన డిజిటల్‌ అసిస్టెంట్లకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సెస్‌ ఆపరేషన్స్‌ నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుప్రజ్‌, జిల్లా గణాంక అధికారి పోతుల మోహన రమణ, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ మాధురి పాల్గొని సాంకేతిక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రీ టెస్ట్‌ కార్యకలాపాల లక్ష్యాలు, విధానాలు, సమయపాలన, డేటా సేకరణలో అనుసరించాల్సిన ప్రమాణాలపై చర్చించారు. అనంతరం గణాంక అధికారి మాట్లాడుతూ.. సెన్సస్‌ కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్‌ విధానంలో జరగనున్నాయని అందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌లు, డేటా ఎంట్రీ టూల్స్‌ వినియోగంపై అధికారులు డీలింగ్‌ అసిస్టెంట్లకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ సమావేశం చివర్లో కలెక్టర్‌ జిల్లా అధికారులతో ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించి క్షేత్రస్థాయి అమలు పద్ధతులు, సాంకేతిక సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు.

Updated Date - Oct 23 , 2025 | 10:39 PM