ప్రమాదనామ సంవత్సరం
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:08 AM
జిల్లాలో 2025 ప్రమాదాల సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలు తీరని ఆవేదనను మిగిల్చాయి.
జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదాలు
ఉలిందకొండ బస్సు ప్రమాదం మర్చిపోలేని ఘటన
పెరిగిన దొంగతనాలు
మారిన పోలీస్ బాస్
సైబర్ క్రైంపై విస్తృత అవగాహన సదస్సులు
2025 క్రైం రౌండప్
జిల్లాలో 2025 ప్రమాదాల సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలు తీరని ఆవేదనను మిగిల్చాయి. ఒక్క ఉలిందకొండలో బస్సు ప్రమాదమే సుమారు 19 మందిని పొట్టన పెట్టుకుంది. మరో ప్రమాదంలో ముగ్గురు, నలుగురు చొప్పున మృతి చెందారు. మరొక్క రోజులో 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ ఏడాది జిల్లా పోలీస్ బాస్ మారగా.. జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం మరో విశేషం. అనేక బందోబస్తులతో ఈ ఏడాది పోలీసులు తీవ్రంగా సతమతమయ్యారు.
కర్నూలు క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
మారిన పోలీసు బాస్
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఎస్పీగా బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా బదిలీపై వెళ్లారు. డీఐజీగా కోయ ప్రవీణ్ కొనసాగారు. ఈ ఏడాది చివరి ఆఖరిలో ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు డీఐజీగా పదోన్నతి లభించింది. మరో రెండు మూడు రోజుల్లో ఆయన స్థానం కూడా మారనుంది. ఈ పది నెలల కాలంలో జిల్లాలో తన స్థానాన్ని విక్రాంత్ పాటిల్ పదిలం పెట్టారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా పలు నిర్ణయాలు తీసుకుని జిల్లాలో నేరాల శాతాన్ని కొంత మేర తగ్గించారు. ముఖ్యంగా హెల్మెట్ ధారణ, డ్రంకెన్ డ్రైవ్, సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలపై దృష్టి సారించి గంజాయి సాగు, ఈవ్ టీజింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.
ఘోర రోడ్డు ప్రమాదాలు
2024లో 547 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2025లో 658 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చిన్న టేకూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర ఆవేదన మిగిల్చింది. ఈ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా, మరి కొంత మంది గాయపడ్డారు.
డిసెంబరు 2వ తేదీన నగర శివారులోని సంతోష్‌నగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. వీరు బైక్‌పై వస్తుండగా.. ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొ ట్టడంతో మృతి చెందారు.
కర్నూలు నగరంలో బళ్లారి చౌరస్తా కేశవ్ గ్రాండ్ హోటల్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఫ్లైఓవర్ చివరిలో లారీ బ్రేక్ డౌన్ కావడంతో చెక్ చేసుకుంటుండగా.. వేగంగా వస్తున్న మరో లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ (50), వెంకటరామిరెడ్డి (48), శ్రీనివాసులు (48) దుర్మరణం చెందగా.. ఇంతియాజ్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆ గ్రామంలో కన్నీటి వేదన
ఆగస్టు 19న ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర కన్నీటి వేదన మిగిల్చింది.
హత్యలు, కిడ్నాప్‌లు
2024లో 34 హత్యలు జరగ్గా.. 2025లో 29 హత్యలు జరిగాయి. 15 శాతం తగ్గుదల కనిపించింది. 2024లో 41 హత్యాయత్నం కేసులు నమోదు కాగా 2025లో 29 హత్యాయ త్నం కేసులు నమోదయ్యాయి. 2024లో 16 కిడ్నాప్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 17 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో కల్లూరు శరీన్‌నగర్‌లో జరిగిన సంజన్న హత్య ఈ ఏడాది కలకలం సృష్టించింది.
పెరిగిన పగటి దొంగతనాలు
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 8.90 కోట్ల విలువైన సొత్తును చోరీ చేశారు. వీటిలో 68 శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. 2024లో ఒక డెకాయిట్ కేసు నమోదు కాగా, 2025లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2024లో నాలుగు రాబరీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 8 కేసులు నమోదయ్యాయి. 2024లో 290 దొంగతనాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 283 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2024లో 26 పగటి దొంగతనాలు నమోదు కాగా, ఈ ఏడాది 46 పగటి దొంగతనాల కేసులు నమోదయ్యాయి.
53 మందికి జైలు శిక్ష
ఈ ఏడాది 23 కేసుల్లో 53 మందికి జైలు శిక్ష పడేలా పోలీసులు తీవ్ర కృషి చేశారు. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు రెండు నెలల్లోనే శిక్ష పడింది. ఈ ఏడాది ఐదు కేసుల్లో 15 మందికి జీవిత ఖైదు పడగా, ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఒక కేసులో ఐదుగురికి 9 ఏళ్లు జైలు శిక్ష, మరొక కేసులో ఐడుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, మరో మూడు కేసుల్లో 11 మందికి ఐదేళ్ల జైలు శిక్ష, మరొక కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఇంకో నాలుగేళ్ల కేసుల్లో మూడేళ్ల జైలు శిక్ష పడటంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు.
పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు
గత ఏడాది 1613 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 9,196 డ్రంకెన్ కేసులు నమోదు చేశారు. జిల్లాలో అన్నీ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం తనిఖీలు చేసి డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారిని పట్టుకుని కొంత మందికి శిక్ష పడేలా చేయడంలో పోలీసులు కృషి చేశారు. దీని వల్ల మద్యం తాగి వాహనాలు నడపడంతో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించగలిగారు. అలాగే గత ఏడాది 4,338 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయగా ఈ ఏడాది 17,392 కేసులు నమోదయ్యాయి.
ఎంవీఐ యాక్టు కేసులు
2024లో 3,631 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి రూ.19.42 లక్షల జరిమానా విధిం చగా.. ఈ ఏడాది 720 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. అలాగే 2024లో 63,626 ఎంవీఐ యాక్టు కేసులు నమోదు చేసి రూ.2.41 కోట్లు జరిమానా విధించగా.. ఈ ఏడాది 71,705 కేసులు నమోదు చేసి రూ.2.77 కోట్ల జరిమానా విధించారు.
మహిళలపై తగ్గిన ఆఘాయిత్యాలు
2024లో మూడు వరకట్న కేసులు, పది అత్యాచార కేసులు, 61 పోక్సో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3 వరకట్న కేసులు, 5 అత్యాచార కేసులు, 37 పోక్సో కేసులు మాత్రమే నమోదయ్యాయి.
మట్కా కేసులు
2024లో 65 మట్కా కేసులు నమోదు చేసి 162 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడాది 89 మట్కా కేసులు నమోదు చేసి 146 మందిని అరెస్టు చేశారు. అలాగే గత ఏడాది 252 పేకాట కేసులు నమోదు చేసి 1251 మందిని అరెస్టు చేయగా.. ఈ ఏడాది 304 కేసులు నమోదు చేసి 1131 మందిని అరెస్టు చేశారు. ఈ మట్కా కేసులో 1.17 కోట్ల నగదు సీజ్ చేశారు.
శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి
జిల్లాల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. సైబర్ నేరాలపై 5,830 అవగాహన సదస్సులు నిర్వహించాం. యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. ఐదుగురు రౌడీషీటర్లను జిల్లా నుంచి బహిష్కరించాం. సమస్యాత్మక, ఫ్యాక్షన్ ప్రభావిత ప్రదేశాలను గుర్తించి 5,994 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ద్వారా ఉలిందకొండ దగ్గర జరిగిన ఏటీఎం దొంగతనం కేసును, త్రీటౌన్ పరిధిలో సాయిబాబా నగర్‌లో జరిగిన హత్య కేసును ఛేదించగలిగాం. ఎస్సీ, ఎస్టీలపై 13.71 శాతం నేరాలు తగ్గాయి. సైబర్ నేరాలు కూడా పూర్తిగా దాదాపు కట్టడయ్యాయి.
- విక్రాంత్ పాటిల్, ఎస్పీ