సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:59 PM
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం జిల్లా అవినీతి నిరోధక శాఖాధికారుల మెరుపు దాడులు నిర్వహించారు.
సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.50,340 అదనపు డబ్బులు స్వాధీనం
ఆళ్లగడ్డ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం జిల్లా అవినీతి నిరోధక శాఖాధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా కార్యాలయంలోకి వచ్చి ఎవరూ బయటకు పోకుండా తలుపులు మూసివేసి సోదాలు నిర్వహించారు. ఒక్క అధికారి వద్ద తప్ప మిగతా అధికారులు, సిబ్బంది వద్ద అదనంగా ఉన్న డబ్బులు స్వాధీనం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగానే ఆవరణలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు ల్యాప్‌టాప్, ప్రింటర్, ఇతర సామగ్రి, దస్తావేజులు పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆతర్వాత ఆ వస్తువులను తీసుకెళ్లినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు కార్యాలయంలోని రిజిస్టర్, స్టాంప్ రికార్డులు, కంప్యూటర్లలో నమోదు అయిన రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ ఒక్క ఉద్యోగి వద్ద తప్ప అందరి వద్ద అదనపు మొత్తం డబ్బులు ఉన్నాయని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ (ఎస్‌ఆర్వో) చైతన్య రాయల్ వద్ద నుంచి రూ.5,580, స్టాంప్ వెండర్ అనిల్ వద్ద రూ 8,060, సీనియర్ అసిస్టెంట్ చింతల షంషుద్దీన్ వద్ద రూ.17,040, డాక్యుమెంట్ రైటర్లు చాంద్‌బాషా వద్ద రూ 2,180, విశ్వనాథ్‌రెడ్డి వద్ద రూ 17,480 ఉన్నట్లు వెల్లడించారు. వీరందరి నుంచి మొత్తం రూ. 50,340 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అదనపు డబ్బులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనల ప్రకారం కార్యాలయంలో ఎవరి వద్ద అదనపు డబ్బులు ఉండకూడదన్నారు. అలాగే డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోకి రాకూడదని, అయితే పలువురు డబ్బులతో కనిపించారని తెలిపారు. ఈమేరకు డబ్బులు లభించిన ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.