Share News

ఆనందాల డోలిక.. వెలుగుల వేడుక

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:39 PM

ఆనందాల డోలిక.. వెలుగుల వేడుక దీపావళి. ఇంటిల్లిపాది ఉత్సాహంగా జరుపుకునే సంబరం.

ఆనందాల డోలిక.. వెలుగుల వేడుక

నేడు దీపావళి

కర్నూలు కల్చరల్‌/ నంద్యాల కల్చరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆనందాల డోలిక.. వెలుగుల వేడుక దీపావళి. ఇంటిల్లిపాది ఉత్సాహంగా జరుపుకునే సంబరం. ముచ్చటగా రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకలో ఆదివారం నరక చతుర్దిని నిర్వహించారు. సోమవారం దీపావళిని ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున చీకట్లను పారదోలుతూ, లోకాన వెలుగులు నింపుతూ వేడుకను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా సంబరాలను నిర్వహించుకుంటారు. కొత్త పద్దులు సిద్ధం చేసుకొని, లక్ష్మిపూజలకు వ్యాపారులు సమాయత్తమవుతున్నారు. దీపావళికి నోములు నోచుకుకోడానికి సిద్ధమయ్యారు.

‘దీపేన సాధ్యతే సర్వం’ అని శాస్త్ర వచనం. ‘దీపంతో దేనినైనా సాధించొచ్చు’అని దీని సారాంశం. నిత్యం ఉదయం, సాయంత్రం సంధ్య వేళల్లో ఇంట్లో వెలిగించిన దీపాలు ఐశ్వర్యకారకంగా నిలుస్తాయని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి, ఫలం, పుష్పాలు సమర్పించి, ఇష్టదేవతకు నమస్కరిస్తే చాలని పురాణాలు పేర్కొంటాయి. దీపమున్న చోట దేవతలు నివసిస్తారని దీపావళి రోజున ఇళ్లల్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతిస్తారు.

శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైన వేడుక

దీపావళి రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పార దోలి, జగత్తును తేజోవంతం చేస్తుంది. అందుకే దీపావళి నాడు సర్వ శుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం మన సంప్ర దాయం. లక్ష్మీదేవి దీపజ్యోతిగా, జ్యోతిని లక్ష్మి మూర్తిగా భావించి దీపావళి రోజున దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

నరకాసురుడిని వధించిన సందర్భంగా..

లోక కంటకుడైన నరకాసురుడిని సత్యభామ వధించడం, ముల్లోకాలను గడగడలాడించిన లంకాధిపతి దశకంఠుడ్ని శ్రీరాముడు జయించిన సందర్భంగా ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగిస్తూ, బాణసంచా కాలుస్తూ సంబరంగా దీపావళి వేడుక నిర్వహించారనేది పౌరాణిక ప్రాశస్త్యం. కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాత వాసం ముగించుకొని తమ రాజ్యానికి తిరిగి వచ్చిన సందర్భంగా దీపాలు వెలిగించి ప్రజలు దీపావళి జరుపుకొన్నారని భారతంలో ఉంది.

దుకాణాలు కిటకిటలాడుతున్నాయి

గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో టపాసుల దుకాణాలు వెలిశాయి. కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఆనందాల దీపావళిని అప్రమత్తంగా జరుపుకోవాలని పలువురు అధికారులు, తదితరులు సూచిస్తున్నారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

దీపావళికి ప్రాముఖ్యత ఉంది

దీపావళి పండుగకు వైజ్ఞానికంగా మానవ సమాజానికి మేలు చేసే ఎంతో ప్రాముఖ్యత ఉంది. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకొని ప్రతి వ్యక్తి జీవితంలో ముందుకు పోవాలనే అర్థం ఇందులో ఉంది. ఈ వేడుకలో దీపాల అలంకరించడంతో వచ్చే వెలుగు మానసిక ఆనందాన్ని కలిగిస్తే, దీపాల వెలుగుతో పాటు బాణసంచా వెలుగుతో వచ్చే కాంతి మనసులో భయాలను దూరం చేస్తుంది.

Updated Date - Oct 19 , 2025 | 11:39 PM