Share News

మాటల యుద్ధం

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:12 PM

నగరపాలక సమావేశ భవనంలో శుక్రవారం వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

మాటల యుద్ధం
సభలో వాదోపవాదాలు చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ సభ్యులు

వైసీపీ కార్పొరేటర్లకు ప్రజాభివృద్ధి పట్టదు: టీడీపీ

కమిషనర్‌పై వైసీపీ కార్పొరేటర్ల ఆగ్రహం

సమావేశం వాయిదా వేసిన మేయర్‌

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): నగరపాలక సమావేశ భవనంలో శుక్రవారం వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సర్వసభ్య సమావేశం ప్రారంభం కాకముందే వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్‌ సమావేశానికి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సమావేశాన్ని బాయ్‌ కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ కార్పొరేటర్లు కలగజేసుకుని ఇంకా ఏజెండా చదవకముందే బాయ్‌కాట్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ కార్పొరేటర్లు వెళ్లిపోయినా సమావేశాన్ని నిర్వహించాలని టీడీపీ కార్పొరేటర్లు కోరారు. 18మంది టీడీపీ కార్పొరేటర్లు లే కుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారో మేము చూస్తామని వైసీపీ కార్పొరేటర్లు సవాల్‌ విసిరారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన కార్పొరేటర్లకు విలువలు లేవని వారు ఎద్దేవాచేశారు. వైసీపీలో ఉండి మీరు ఏమిచేస్తున్నారో మాకంతా తెలుసునని టీడీపీ కార్పొరేటర్లు సమాధానం ఇచ్చారు. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరుతో మేయర్‌ బీవై రామయ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్‌చార్జి, డిప్యూటీ కమిషనర్లు ఆర్‌జీవి.కృష్ణ, సతీ్‌షకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.నాగశివప్రసాద్‌, ఇతర విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

సాకులు చూపి సమావేశాన్ని బాయ్‌కాట్‌..

వైసీపీ కార్పొరేటర్లకు ప్రజల అభివృద్ది పట్టదని టీడీపీ పరమేష్‌, కైప పద్మలతారెడ్డి, అన్నారు. మీడియాతో వారు మాట్లాడుతూ కేవలం కమిషనర్‌ సమావేశానికి రాలేదనే సాకుతో సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్లు బాయ్‌కాట్‌ చేస్తున్నారని విమర్శించారు.

అసలు స్పందించడం లేదు

నగరపాలక కమిషనర్‌ వైసీపీ కార్పొరేటర్లకు అసలు స్పందించడం లేదని, ఫోన్‌ చేసినా పలకడం లేదని ఆరోపించారు. కార్పొరేటర్లు కలవాలని అనుకున్నా కమిషనర్‌ అవకాశం ఇవ్వడం లేదన్నారు. వైసీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి బాయ్‌కాట్‌ చేయాలని మేయర్‌ బీవై.రామయ్యను చుట్టుముట్టారు. మేయర్‌ ఎంత సర్దిచెప్పినా కూడా కార్పొరేటర్లు వినలేదు. కోరం లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని వైసీపీ కార్పొరేటర్లు మేయర్‌ను ప్రశ్నించారు. కనీసం 18 మంది కార్పొరేటర్లు లేకుండా 14 మంది ఉండగా సమావేశం నిర్వహిస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

ఒక్కసారి వాయిదా వేస్తే..

సమావేశం వాయిదా పడిన తరువాత టీడీపీ కార్పొరేటర్లు 18 మంది రావడంతో ఎలాగైనా సమావేశాన్ని నిర్వహించాలని కార్పొరేటర్లు పరమేష్‌, క్రాంతికుమార్‌ మేయర్‌ను అభ్యర్థించారు. దానికి నిబంధనలు ఒప్పుకోవని ఒక్కసారి సమవేశం వాయిదా వేశాక మరో రోజు నిర్వహించుకోవాలని ఉందని మేయర్‌ సర్ది చెప్పారు.

Updated Date - Dec 19 , 2025 | 11:12 PM