విషాదం నింపిన విహారయాత్ర
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:40 AM
విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు కాగా.. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ విషాద ఘటన గురువారం జరిగింది
ఒకరి మృతదేహం లభ్యం.. లభ్యం కాని మరొకరి ఆచూకీ
గోనెగండ్ల/ఎమ్మిగనూరు, అక్టోబరు 16(ఆంఽధ్రజ్యోతి): విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు కాగా.. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ విషాద ఘటన గురువారం జరిగింది. వివరాలివీ.. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన శివ, బాబు, అస్తబ్, ధనుంజయ్, శ్రీనాథ్, సాయిగణేశ్, చెన్నారెడ్డి(20), ఉదయ్‌కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఏఐ) మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరంతా కళాశాలకు వెళ్తున్నామని చెప్పి గాజులదిన్నె ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. అక్కడ సంతోషంగా గడిపారు. అనంతరం మూడు గంటల సమయంలో భోజనం చేసి స్నానం చేయడానికి నాలుగో క్రస్ట్ గేట్ దగ్గరకు వెళ్లారు. అక్కడ నీటి విడుదల కొనసాగుతోంది. అక్కడికి వెళ్లిన వారిలో ముగ్గురు విద్యార్థులు చెన్నారెడ్డి, ఉదయ్‌కుమార్, శివ జారిపడ్డారు. శివ అనే విద్యార్థి ప్రాణాలతో బయట పడ్డాడు. ఉదయ్‌కుమార్, చెన్నారెడ్డి నీటిలో కొట్టుకుపోయి కింద ఉన్న నీటి గుంతలో కూరుకుపో యారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. చెన్నారెడ్డి మృతదేహం లభ్యం
కాగా.. ఉదయ్‌కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. చెన్నారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎవరూ స్పందించలేదు..
నీటి ఉధృతిలో తమ కళ్ల ముందే తమ స్నేహితులు కొట్టుకుపోయారని, కాపాడాలని అక్కడున్న వారిని వేడుకున్నా స్పందించలేదని స్నేహితులు రోదించారు. మా రోదనలు వారి మనసులను కరిగించలేదేమో అని, ఆ సమయంలో సహాయం చేసి ఉంటే తమ స్నేహితులు బతికి ఉండేవారేమో మరి అని కన్నీటి పర్యంతమయ్యారు.
కాలేజీకి అని చెప్పి వెళ్లాడు
కాలేజీకి అని చెప్పి వెళ్లాడని.. ఇలా గల్లంతయ్యా డని ఎమ్మిగనూరుకు చెందిన ఉదయ్‌కుమార్ తల్లిదండ్రులు గోవిందు, రాధ బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. చిన్న కుమారుడు ఉదయ్‌కుమార్ ఎర్రకోట బీటెక్ కళాశాలలో చదువుతున్నాడు. వీరు చేనేత పనులు చేస్తు జీవనం సాగించే వారు. గురువారం ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి ఉదయ్‌కుమార్ అమ్మా కాలేజికి వెళ్లి వస్తానని చెప్పి బయలు దేరాడు. మధ్యా హ్నం మూడున్నర సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని, ఇక్కడ మమ్మల్ని ఇక చూసుకునే వాడే లేడని మేము ఎవరి కోసం బతకాలి అంటూ కన్నీరుమున్నీరయ్యారు.
అదొక మృత్యు గుంత
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల దగ్గర ఉన్న నీటి గుంత మృతు కుహరంగా మారిం ది. నీటి విడుదల చేసిన ప్రతి సారి ఒకరిద్దరు ఆ గుంతలోపడి మృతి చెందుతూనే ఉన్నారు. మూగేళ్ల క్రితం కోడుమూరు కు చెందిన గొల్ల సుధాకర్(22) అనే యువకుడు సెల్ఫీ కోసం వెళ్లి నీటి లో చెప్పులు పడిపోవడంతో నీటిలోకి దిగడంతో కొట్టుకుపో యాడా. మూగజీవాలు కూడా అందులో పడి మృతి చెందాయి. ఈ నీటి గుంత క్రస్ట్ గేట్ల నుంచి వచ్చే నీటి ఉదృతికి గుంత పెద్దదిగా మారి ప్రమాదకంగా ఉంది. దీని లోతు దాదాపు రెండు విద్యుత్ స్థంభాల పొడవు ఉంటుందని జాలర్లు చెబుతున్నారు. ఈ రప్రదేశం వైపు ఎవరూ వెళ్లకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.
గుండెపోటుతో మరో విద్యార్థి..
ఎమ్మిగనూరు: పట్టణానికి చెందిన ఓ విద్యార్థి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. వివరాలివీ.. పట్టణంలోని గంగమ్మబావి ప్రాంతంలో నివసిస్తున్న ఫరూక్ చిన్న కుమారుడు అబ్దుల్ రెహమాన్(20) ఎర్రకోట ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్నాడు. గురువారం యథావిధిగా కళాశాలకు వెళ్లాడు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కళ్లుతిరుగుతున్నాయని కుప్పకూలిపడిపోయాడు. తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందాడు. కాగా అబ్దుల్ రెహమాన్‌కు చిన్న వయస్సులో గుండె ఆపరేషన్ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చి ఉంటుందని కళాశాలలో చర్చించుకుంటు న్నారు. బీటెక్ పూర్తి అయితే తమ కష్టాలు తొలగిపోతాయని భభావించిన తల్లిదండ్రులు కుమారుడి అకాల మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు మృతి చెందటం కళాశాలలో విషాదం అలుముకోగా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.