పేదల కోసం అలుపెరగని పోరాటం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:18 PM
పేదలు, కష్టజీవులు, కార్మికుల కోసం సీపీఐ అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
ప్రజలను మోసం చేసిన బీజేపీ
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
సి. క్యాంపు వరకు భారీ ర్యాలీ
కర్నూలు అర్బన్ , డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): పేదలు, కష్టజీవులు, కార్మికుల కోసం సీపీఐ అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శుక్రవారం నగరంలోని సి.క్యాంపు సెంటర్‌లో సీపీఐ కర్నూలు 17వ నగర బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి గాయత్రి ఎస్టేట్, మద్దూరునగర్ మీదుగా సి.క్యాంపు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీలు సీపీఐ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. 2014లో బీజేపీ ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మోసం చేశాయని మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనం తిరిగి తెప్పిస్తామని, నిత్యావసరాలు తగ్గిస్తామని, సంవ్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తామని, ఇచ్చిన హమీ మేరకు 12 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఎంత నల్లధనం తెచ్చారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఒక మాట వచ్చాక ఒక మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 26న అన్ని శాఖల్లో ఎర్రజెండ ఎగరాలని, అందరూ పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. జనవరి 18న ముగింపు ఉత్సవాలు ఖమ్మం నగరంలో జరుగుతాయని కార్యక్రమంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రామంజనేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీ. రామచంద్రయ్య, ఆవులశేఖర్, మునెప్ప, జగన్నాథం, నబిరసూల్, రాజాసాహెబ్, మహేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.