పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన సమాజం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:27 AM
పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన సమాజం

సీఎస్ విజయానంద్
నంద్యాల నూనెపల్లె, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల జిల్లా కేంద్రంలో పెద్దచెరువు కట్టపై కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీఎస్ విజయానంద్, జిల్లా స్పెషల్ అధికారి నివాస్, కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్ ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎస్ విజయానంద్, జిల్లా స్పెషల్ అధికారి నివాస్‌లకు స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, మెప్మా మహిళలు చేపట్టిన భారీ ర్యాలీని సీఎస్ విజయానంద్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ శివారులోని పెద్దచెరువు కట్టపై అతిథులు మొక్కలు నాటారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రతకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను వారు ఆవిష్కరించారు. కట్టపై ఉన్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను సీఎస్, జిల్లా స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ తదితరులు ఏరివేసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ చెరువు కట్టను ట్యాంక్‌బండ్ విధానంలో సుందరీకరించేందుకు కలెక్టర్ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా ఓ కార్యక్రమం చొప్పున ఈ నెలలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం అనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో చల్లా విశ్వనాథ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, సీఐలు, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్, టీడీపీ నాయకులు, సచివాలయం, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.