అహోబిలంలో వైభవంగా పవిత్రోత్సవం
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:03 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించారు. పవిత్రోత్సవాలలో ఐదో రోజు ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో వేదపండితులు శ్రీలక్ష్మీనరసింహస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను హోమ మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన పర్యవేక్షణలో తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక అర్చక బృందం వేద ప్రబంధ పారాయణాలు చేశారు. అనంతరం ప్రహ్లాద వరద స్వామికి అమ్మవార్లకు మంగళహారతి అందించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను పల్లకిపై కొలువు దీర్చి తిరువీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.