హోరెత్తిన నిమజ్జనం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:19 AM
వెళ్లి రావయ్యా గణపయ్య.. మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ కర్నూలులో గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగింది.
2 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం
డీజేల హోరు.. యువత జోరు..
ముగిసిన గణేశ్ ఉత్సవాలు
వెళ్లి రావయ్యా గణపయ్య.. మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ కర్నూలులో గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగింది. ప్రజలు వేలాదిగా రోడ్లపైకి రావడంతో కర్నూలు కాషాయమయంగా మారింది. భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి వినాయక విగ్రహాలను గంగమ్మ ఒడికి సాగనంపారు. 9 రోజుల పాటు అశేష భక్తుల పూజలందుకున్న గణనాథుల నిమజ్జనం కర్నూలులో ఘనంగా పూర్తయింది. నగరంలో శోభాయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. వినాయక విగ్రహాలకు భక్తులు నీరాజనం పలికారు. డీజే పాటలు.. డప్పు దరువులు, ఆట పాటలు, బాణసంచా మోతలతో నగర వీధులన్నీ హోరెత్తాయి. ఈ సందర్భంగా సాగిన శోభాయాత్రలో చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. సామూహికంగా నృత్యాలు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ గణనాథుడిని సందడిగా ఊరేగించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో భారీగా అన్నదానాలు చేశారు. కర్నూలు నగర వ్యాప్తంగా ఉన్న రెండు వేలకు పైగా విగ్రహాలు వినాయక ఘాట్ సమీపంలోని కేసీ కెనాల్‌లో నిమజ్జనం నిర్వహించారు. దీంతో జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో కర్నూలు మార్మోగింది. గురువారం ఉదయం మొదలైన నిమజ్జనోత్సవం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది.
-కర్నూలు కల్చరల్/ కర్నూలు న్యూసిటీ